తొమ్మిది నెలల్లో ఒరగబెట్టిందేమీ లేదు
- విద్యార్థులను తొక్కిపెడుతున్న సర్కార్
- రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శ
- తూప్రాన్‌లో టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం
తూప్రాన్: తెలంగాణ కోసం ఉద్యమిం చిన విద్యార్థులను టీఆర్‌ఎస్ సర్కార్ తొక్కేస్తోందని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావొస్తున్నా చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు.
కరువుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి తీరిక లేని సీఎం కేసీఆర్ దుబాయ్, ముంబై, సింగాపూర్‌లకు తిరుగుతున్నారని చెప్పారు. తండ్రి తర్వాత కుమారుడు కేటీఆర్ సైతం టూర్లు తిరుగుతూ.. సినిమా హీరోయిన్‌లతో క్యాట్‌వాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ పార్టీ స్పష్టంగా ఉందని తెలింగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభల్లో తీర్మానం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
మార్చి 3న అధినేత చంద్రబాబు కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఇదిలావుంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు టీడీపీ నేతలకు వినతి పత్రం అందజేశారు. ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.20 వేల కు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీటీసీ సభ్యుడు ఎక్కల్‌దేవ్ వెంకటేశ్‌యాదవ్ వినతి పత్రం సమర్పించారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి, నాయకులు ఏకే గంగాధర్, బట్టి జగపతి, బక్కి వెంకటయ్య, నరోత్తం, జైపాల్, నాయకులు కిష్టారెడ్డి, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.