'టీఆర్‌ఎస్‌కు తొలి నుంచీ రహస్య స్నేహితుడే'
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు మొదటినుంచీ రహస్య స్నేహితుడే. అర్ధరాత్రి చీకట్లో కలిసే మిత్రుడు కాస్తా ఇప్పుడు బహిరంగంగానే రంగు మార్చుకున్నాడు’’ అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయన స్పందిస్తూ... భయపెట్టి, ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం ఏ తరహా ప్రజాస్వామ్యమో ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పాలన్నారు. ‘‘రాష్ట్రంలో కులాల ఏకీకరణ జరుగుతోంది. దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరడం అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించారు.
‘‘టీడీపీ నుంచి గెలిచిన వారిని దొంగదారిన టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న కేసీఆర్ ప్రజా బలాన్ని నమ్మే నాయకుడైతే వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలి. తెలంగాణలో టీడీపీకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా దొరల గడీల పాలనకు చరమగీతం పాడేవరకు పోరాడతాం. ఎర్రబెల్లి, ప్రకాశ్, వివేక్ వంటి వారెందరు పోయినా తెలంగాణలో టీడీపీకి చావు లేదు. టీడీపీకి చావే ఉంటే ఎర్రబెల్లి పాలకుర్తి నుంచి గెలిచేవారే కాదు’’ అన్నారు. కార్యకర్తల అండతో, బడుగు, బలహీన వర్గాల మద్దతుతో టీడీపీ త్వరలోనే బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.