ఎర్రబెల్లి, రేవంత్ లకు చంద్రబాబు క్లాస్!
విజయవాడ: తెలంగాణ నేతల వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీనియర్ నాయకుల మధ్య విభేదాలపై సీరియస్ గా స్పందించినట్టు సమాచారం. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ టీడీపీ ముఖ్య నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విభేదాలు వీడి ముఖ్య నేతలు కలిసికట్టుగా పనిచేయాలని క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గుండు సుధారాణి పార్టీ వీడటంపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. అయితే సుధారాణి పార్టీని వీడినా నష్టం లేదని చంద్రబాబుతో టి. టీడీపీ నేతలు చెప్పినట్టు సమాచారం.
వరంగల్ ఉప ఎన్నికపై ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎర్రబెల్లి, రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో దూషించుకున్నారు. 'నా జోలికొస్తే రూంలేసి కొడ్తా..' అంటూ ఎర్రబెల్లిపై రేవంత్‌రెడ్డి విరుచుకుపడడంతో పార్టీ నేతలు అవాక్కయ్యారు.