టీడీపీ చిన్నాభిన్నం! | TDP faces major defections in Telangana | Sakshi
Sakshi News home page

టీడీపీ చిన్నాభిన్నం!

Published Fri, Feb 12 2016 11:02 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ - Sakshi

ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్

వరుస దెబ్బలతో ఉనికి కోల్పోయే స్థితిలో తెలుగుదేశం పార్టీ
ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇక మిగిలేదెందరో?
మంచి ఆఫర్ వస్తే వెళ్లేందుకు సిద్ధమంటున్న ‘మిగిలిన’ వాళ్లు
నియోజకవర్గాల ఇన్‌చార్జులు సైతం గులాబీ గూటికే

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యతిరేకించిన పార్టీగా ముద్రపడిన టీడీపీ... 2014 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినగా, ఇటీవలి పరిణామాలతో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలుచుకున్న టీడీపీకి.. ‘గ్రేటర్’ ఎన్నికల తరువాత అందులో మూడోవంతు సభ్యులు కూడా మిగలకపోవడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏడాదిన్నర కాలంలో ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

తాజాగా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉంటూ ఏడాదిన్నర కాలంగా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. దాని నుంచి తేరుకోకముందే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో... గురువారం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా... మరికొందరు మాత్రం తెలంగాణలో పార్టీ వినాశనానికి నేతలే కారణమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి హాజరై టీడీపీ భవిష్యత్తు గురించి ఉపన్యాసం ఇచ్చిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి... సమావేశం అనంతరం నేరుగా మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలతో భేటీ అయి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఖమ్మంతో మొదలు
సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు సీట్లకు పరిమితమైంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ముందుగా ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టిన గులాబీ పెద్దలు... తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో అక్కడి జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సహా గంపగుత్తగా టీఆర్‌ఎస్‌లో కలిపేయడంతో టీడీపీ పతనం మొదలైంది. తరువాత గ్రేటర్‌పై దృష్టి పెట్టిన అధికార పార్టీ... టీడీపీలో బలమైన నేతలుగా పేరున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డిలకు వలవేసింది. అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్నలతో పాటు తాజాగా వివేకానంద గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి కూడా అధికారపార్టీలో బాటపట్టడంతో టీడీపీ శ్రేణులు తెల్లబోయాయి.

ఆఫర్ వస్తే రేవంత్ మినహా అందరూ..
టీడీపీలో ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిలో అరికపూడి గాంధీ పార్టీ మారడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. మిగతా వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముంది. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీసీ ఉద్యమాల్లో బిజీ అయి.. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అక్కడి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పారు.

ఈ పరిస్థితుల్లో బీసీల అంశంపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే అధికార పార్టీలో చేరేందుకు అభ్యంతరం ఉండదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇక టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడిగా, గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఆరోపణలు ఎదుర్కొన్న మాగంటి గోపీనాథ్ కూడా టీఆర్‌ఎస్ నుంచి వచ్చే ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు గ్రేటర్ సహా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా ఉన్న వారు కూడా టీఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement