రాయపర్తిలో కలిసి భోజనం చేస్తున్న కడియం, ఎర్రబెల్లి
-
ఒకే వేదికపై కడియం, ఎర్రబెల్లి
పాలకుర్తి : సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం ఒక్కటయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. సంవత్సరం క్రితం వరకు ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న వైరుద్యంతో కార్యకర్తలు చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి. నేడు ఆ నేతలు ఒకే వేదికపై దర్శనమిచ్చి కలిసి పనిచేస్తామంటూ సందేశం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇది శుభ పరిణామమే అయినప్పటికీ ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుందనేది కొందరిలో నెలకొన్న ప్రశ్న.
గత సంవత్సరం రాయపర్తి మండలంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరితో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయడానికి రాగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు.. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నావని అనడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తరువాత పాలకుర్తి మండల బమ్మెర గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సభలో ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పాలకుర్తిలో వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కడియం శ్రీహరి, సుధాకర్‌రావు వర్గీయులు, ఎమ్మెల్యే దయాకర్‌రావు అనుచరుల మధ్య యుధ్ద వాతావరణం తలపించే విధంగా ఘర్షణలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం కోసమే అధికార పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన ఎర్రబెల్లి నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావుతో కలిసి పనిచేస్తూ డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని శనివారం నియోజకవర్గానికి తీసుకు వచ్చారు. రాయపర్తి, తొర్రూరు మండలాల్లో జరిగిన హరిత హారం కార్యక్రమంలో నేతలంతా ఒకే వేదికపై పాల్గొన్నారు. తామంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామన్నారు. ఒకరి సహకారం ఒకరం తీసుకుంటామని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. ఈ హామీలు నిలుపుకుని జిల్లా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.