ఈ నెల 2న ఎస్పీఎం పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ప్లాంట్‌ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార టీఆర్‌ఎస్ పార్టీలో కొత్త జోష్ కని పిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అనుకూల స్పందన, పార్టీ అధినేత కేసీఆర్ సర్వేల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ నేతలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈనెల 2న జరిపిన కాగజ్‌నగర్ పర్యటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత మూతపడ్డ తొలి పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్(ఎస్పీఎం)ను తిరిగి తెరిపించిన ఘనతను సొంతం చేసుకున్న కేటీఆర్ సిర్పూర్ ప్రజానీకానికే గాక ఉమ్మడి జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
ఈ సభ ద్వారా తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసిన కేటీఆర్ పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రజల్లో పార్టీ, ప్రభుత్వంపై ఉన్న అనుకూల వాతావరణాన్ని కొనసాగించేలా కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్ధేశం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. కేటీఆర్ సభ స్ఫూర్తితో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు భవిష్యత్తులో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు కూడా ఎన్నికల ఎజెండాతో అడుగులు వేస్తున్నారు.
రెండు జిల్లాలపై ఎస్పీఎం ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు జిల్లాలైన కుమురం భీం, మంచిర్యాల జిల్లాలపై సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభ ప్రభావం ఎక్కువగా పడిందనడంలో సందేహం లేదు. బొగ్గు గనులతో పాటు సిమెంట్ పరిశ్రమలు ఉన్న ఈ రెండు జిల్లాల్లో మూతపడ్డ పేపర్ మిల్లు తిరిగి తెరుచుకోవడం కొత్త భరోసా ఇచ్చింది. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 2014లో మూతపడ్డ కాగితం పరిశ్రమను తెరిపించేందుకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేయని ప్రయత్నమంటూ లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ద్వారా ఎస్పీఎంను తిరిగి తెరిపించడంలో కీలక పాత్ర పోషించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ హవాలో 1989, 1994లో ఇండిపెండెంట్‌గా పాల్వాయి పురుషోత్తంరావు, 2009లో టీఆర్‌ఎస్ నుంచి కావేటి సమ్మయ్య, 2014లో బీఎస్పీ నుంచి కోనప్ప విజయం సాధించడం వంటి పరిణామాలన్నీ ఈ నియోజకవర్గం విలక్షణ స్వభావానికి అద్దం పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా అనూహ్య పరిణామాలేవైనా చోటు చేసుకొంటాయేమోనన్న ఆందోళన టీఆర్‌ఎస్‌లో ఉండగా, ఎస్పీఎంను తెరిపించడం వల్ల కొత్త ధైర్యం వచ్చినట్లయింది. ఈ ప్రభావం పక్కనే ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంపై కూడా పడనుందనడంలో సందేహం లేదు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ రూ.2000 కోట్లతో విస్తరణకు సిద్ధమవడం, సింగరేణిలో కొత్త గనులు, కార్మికులకు బోనస్, మెడికల్ అన్‌ఫిట్‌తో ఉద్యోగాలు వంటి పరిణామాలు మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గల కార్మికులు, ఉద్యోగులు, యువతకు భవిష్యత్తుపై ఆశలను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలన్నీ వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
ఆదివాసీలకు కొత్త పంచాయతీలు... సంక్షేమ పథకాలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం ఆదివాసీలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 500 పైబడిన జనాభా ఉన్న ఆదివాసీ గూడేలన్నింటిని పంచాయతీలుగా మార్చడంతో గతంలో 243 పంచాయతీలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనే కొత్తగా 226 జీపీలు ఏర్పాటయ్యాయి. మొత్తం ఉమ్మడి జిల్లా పరిధిలో 659 కొత్త గ్రామ పంచాయతీలు రావడం విశేషం. విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో ఒక వర్గం ఆధిపత్యంపై ఆగ్రహంతో స్వయం పాలన, అధికారాల కోసం ఆందోళన చేస్తున్న ఆదివాసీలను ఈ పరిణామం కొంత సంతృప్తి పర్చినట్లయింది. అమ్మ ఒడి పథకం ద్వారా గర్భిణులకు అందించే కేసీఆర్ కిట్స్‌పై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనలను ఆదివాసీ వర్గానికి సడలింపు చేస్తూ ఇటీవల విడుదల చేసిన జీవో కూడా తమకు ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెపుతున్నాయి.
అలాగే రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా అందించే పెట్టుబడి సాయం, రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు కూడా వర్తింపజేయడం అనుకూలించే విషయంగా భావిస్తున్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, ఆత్రం సక్కు కాంగ్రెస్‌లో ఉండడంతో ఆందోళన చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆదివాసీలకు అందిస్తున్న పథకాలతో ఊపిరి పీల్చినట్లయింది. ఆదివాసీలు కూడా తమతోనే ఉంటారని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అలాగే ఎస్పీఎం పునరుద్ధరణ నేపథ్యంలో ఆదిలాబాద్ మూతపడిన సీసీఐ పనఃప్రారంభానికి కృషి చేస్తామని కేటీఆర్ ప్రకటించడం ఈ ప్రాంత వాసుల్లో కొత్త ఆశలు కలిగించింది.
కేటీఆర్ సూచనతో ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, నేతలు
కాగజ్‌నగర్ పర్యటనలో భాగంగా ఈనెల 2న ఎస్పీఎం గెస్ట్‌హౌస్‌లో మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో అనుకూల వాతావరణం ఉందని, వచ్చే ఎన్నికల వరకు దాన్ని కొనసాగించేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిత్యం ప్రజల్లో ఉంటే జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు ఢోకా ఉండదని హితబోధ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గ్రామాల పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు కూడా చాపకింద నీరులా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment