సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, పెద్దపల్లి: దళితబంధు లబ్ధిదారులు ఆ మొత్తం పొందేందుకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. దళితులు ధనికులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి రూ.10 లక్షలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తోందని, తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారని అడిగితే.. ప్రతి ప్రజాప్రతినిధి గంటసేపు చెప్పగలరని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిలో 19 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు. నల్లధనం వెనక్కి తెస్తానని, జన్‌ధన్ ఖాతా తెరిపించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన గడ్డం తాత (పీఎం మోదీ) తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ టూ జెడ్ స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ తెలంగాణకు వచ్చి అవినీతి గురించి మాట్లాడుతున్నారని, వారిని నమ్మొద్దని కోరారు.
కేటీఆర్ సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు శంకుస్థాపన, బెల్లంపల్లిలో పుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, అర్బన్ మిషన్ భగీరథలకు ప్రారంభోత్సవం చేశారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న ఏడు వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో, రామగుండంలో నిర్వహించిన ‘రామగుండం నవనిర్మాణ’సభలో ఆయన మాట్లాడారు.
ఆ బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలి
‘ప్రధాని, అదానీ అవిభక్త కవలు. ఆ దోస్తును ధనవంతుల్లో 603వ స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులను అదానీకి కట్టబెట్టేందుకే వేలం పాట నిర్వహిస్తున్నారు. గాలి మోటరులో రామగుండం వచ్చిన మోదీ సింగరేణిని అమ్మబోమని గాలిమాటలు చెప్పారు. ఆ తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారు. గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని సింగరేణికి కేటాయించాలి. పొరపాటున సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుంది.’ అని మంత్రి హెచ్చరించారు.
బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి: ‘బొగ్గు గనులను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలి. మోదీ వచ్చాక గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెర్రెలు, నెత్తురు పారిన తెలంగాణలో నేడు కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు పారుతున్నాయి. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కథానాయకులు కావాలి.’ అని కేటీఆర్ పి లుపునిచ్చారు.
ఆకాశంలో స్పెక్ట్రమ్ నుంచి పాతా ళంలో బొగ్గును విడిచిపెట్టని కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్నారని, మరి పదిసార్లు అవకాశం ఇస్తే ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు. పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అమ్మతోడు ఇక్కడ ఐటీ కంపెనీలంటే నమ్మలే..!
‘బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలు ఉన్నాయంటే అమ్మతోడు నేనసలు నమ్మలేదు. ఎమ్మెల్యే చిన్నయ్య తీసుకెళ్లి చూపిస్తే, వాళ్లని చూసి ఎంతో స్ఫూర్తి పొందా. రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు అనే యువకులు అమెరికా, యూరప్ లాంటి ప్రాంతాల్లో స్థిరపడకుండా పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలని అనలటిక్స్ ఐటీ కంపెనీతో 100 మందికి, వెంకటరమణ వాల్యూ పిచ్ కంపెనీతో 200 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రపంచంతో పోటీ పడేలా ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు.
చదవండి: ఇంఫాల్ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
Comments
Please login to add a commentAdd a comment