కరీంనగర్: పల్లెల్లో కొత్త పండుగకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్‌ల పాలన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇదివరకు సర్పంచులు, వార్డు మెంబర్‌ల పాలనలో సాగిన గ్రామాలు గురువారం నుంచి కొత్త అధికారులు పాలించనున్నారు. పల్లెల్లో పండుగ వాతావరణం కల్పించేందుకు స్పెషల్ ఆఫీసర్లు సమాయత్తమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 276 పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా మరో 53 పంచాయతీలు ఏర్పడ్డాయి. కాగా.. కరీంనగర్ నగర పాలక సంస్థ, హుజూరాబాద్ మున్సి పాలిటీ, జమ్మికుంట నగర పంచాయతీలలో 15 పంచాయతీలను విలీనం చేశారు. కొత్తపల్లి, చొప్పదండి మండల కేంద్రాలను మున్సిపాలిటీగా గుర్తించడం, కరీంనగర్ నగర పాలక సంస్థలో విలీనంపై హైకోర్టుకు వెళ్లిన 8 గ్రామాలను తిరిగి పంచాయతీలుగా కొనసాగించాలని తీర్పు వచ్చింది. దీంతో జిల్లాలో ఉన్న మొత్తం 329 పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగనుంది. పల్లెల ప్రగతే ప్రధాన లక్ష్యంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనకు విధులు ఖరారయ్యాయి.
ఈ మేరకు మార్గదర్శకాలను అధికారులు జారీ చేశారు. నిధులను ఏయే అంశాలకు ఎంత మేరకు ఖర్చు చేయాలనేది నిర్దేశించారు. గ్రామాల పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగిసిపోనుంది. 5 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు తమ విధులకు వీడ్కోలు చెప్పనున్నారు. ఆగష్టు 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. గడువు ముగిసిపోతున్న పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా రిజర్వేషన్‌ల అంశాలను తేల్చేవరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమైంది. మంగళవారం వారికి గ్రామాల బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తూ ప్రొసీడింగ్స్ వెలువరించనున్నారు. ప్రత్యేక అధికారుల విధులను ఖరారు చేస్తూ మార్గదర్శకాలను సైతం జారీ చేశారు. గ్రామ పంచాయతీల నిధులను వినియోగించడంపై మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిధుల వినియోగాన్ని ఆరు విభాగాలుగా వర్గీకరించారు.
2 నుంచి కొత్త పండుగే...
ఆగష్టు 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధి కారుల పాలన ప్రారంభం కానున్న నేపథ్యం లో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిం చేలా.. కొత్త పాలనను ప్రారంభించాలని ప్రభుత్వం పూనుకుంది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్‌లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలన ఎలా చేయాలి.. గ్రామాల్లో తొలి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి.. తదితర విషయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంబురంగా తొలి రోజు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల కార్యాలయాలకు రంగులు వేసి అలంకరించాలని ఆదేశించారు. కొత్త కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పెద్దఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment