రుణ మాఫీ అమలుపై టీ సర్కారు నిర్ణయం
వడ్డీ భారంపెరగకుండా సెప్టెంబర్‌లోనే తొలివిడత చెల్లింపులు
రూ. 40 వేలలోపు వారికి మొత్తం, లక్ష వరకున్న వారికి 30 శాతం విడుదల!
హైదరాబాద్: రైతుల రుణ మాఫీ మొత్తాన్ని రెండేళ్లలోనే బ్యాంకులకు తిరిగి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత వరకు వడ్డీ భారాన్ని తగ్గించుకోడానికి కసరత్తు చేస్తున్న సర్కారు ఈ దిశగా చర్యలు చేపట్టింది. రుణాల చెల్లింపులో జాప్యం చేస్తే వడ్డీ భారంతో నడ్డి విరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాల మాఫీ వల్ల ఖజానాపై దాదాపు రూ. 17,337 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇందులో గత ఏడాది ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలు రూ. 8500 కోట్లు కాగా, పాత బకాయిలు మరో 8,800 కోట్ల వరకు ఉన్నాయి. అయితే ఎన్ని రుణాలు తీసుకున్నా కుటుంబానికి లక్ష వరకే మాఫీ చేస్తామని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ భారం కొంత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
రుణ మాఫీ అమలుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో దీనిపై ఉన్నతస్థాయి అధికారుల కమిటీ గురువారం సచివాలయంలో సమావేశమైంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్ , సహకార శాఖ కమిషనర్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, నాబార్డు ప్రతినిధి, ఆప్కాబ్ ఎండీ, గ్రామీణ బ్యాంకుల ప్రతినిధి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు సభ్యులుగా ఉన్నారు. రుణాల మొత్తాన్ని బ్యాంకులకు ఎలా చెల్లించాలన్న దానిపైనే తాజా సమావేశంలో కమిటీ దృష్టి సారించింది. వడ్డీ భారం తగ్గించుకోవాలంటే వీలైనంత త్వరగా చెల్లింపులు చేయాలని అభిప్రాయపడింది. తొలి దశ నిధులను సెప్టెంబర్‌లోనే బ్యాంకులకు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ దఫా నిధులతో రూ. 40 వేలలోపు రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేయాలని, అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న రుణాల్లో 30 శాతం నిధులను బ్యాంకులకు చెల్లించాలని అభిప్రాయపడ్డారు. 30 శాతం నిధులు చెల్లించిన తర్వాత సదరు రైతుల రుణాలు రెన్యువల్ అవుతాయని, తద్వారా బ్యాంకులు వారికి కొత్త రుణాలు ఇస్తాయన్న అభిప్రాయానికి వచ్చారు. ఆగస్టు 31ని నోటిఫై తేదీగా లెక్కించి వడ్డీతో సహా బ్యాంకులకు ఎంత మొత్తం చెల్లించాలన్న దానిపై సెప్టెంబర్ తొలి వారంలోగా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కూడా కమిటీ నిర్ణయించింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు తుది గడువును వచ్చే నెలాఖరు వరకు కేంద్రం ఇటీవలే పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ గడువులోగా కొత్త రుణాలు తీసుకునే రైతుల నుంచే పంటల బీమా ప్రీమియాన్ని వసూలు చేస్తారు. ఒకవేళ సెప్టెంబర్ 30లోగా పాత బకాయిలు చెల్లించకుంటే.. రైతులకు కొత్త రుణాలు రాక.. పంటల బీమా కూడా వర్తించని పరిస్థితులు వస్తాయని, దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఈ సమావేశం అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో యుద్ధ ప్రతిపాదికన రుణ మాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని, సెప్టెంబర్‌లోనే బ్యాంకులకు తొలి విడత నిధులను చెల్లించాల్సి ఉంటుందని ఆ కమిటీ నిర్ణయానికి వచ్చింది. అయితే తొలి విడతగా ఎంత మొత్తం చెల్లించాలన్న దానిపై వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రుణాల రీషెడ్యూల్ విషయంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ను కలవడానికి గత వారంలో ఆర్థిక శాఖ అధికారులు అపాయింట్‌మెంట్ కోరారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రాసిన లేఖకు కూడా రిజర్వ్ బ్యాంకు నుంచి ఎలాంటి సమాధానం రానట్లు తెలిసింది.
రెండేళ్లలో చెల్లింపులు
Published Fri, Aug 15 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement