
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ‘గాంధీ ముఖచిత్రం’
వరంగల్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన చిత్ర కళాకారుడు నీలం శ్రీనివాసులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. చాక్‌పీస్‌పై మూడు వైపులా మహాత్మాగాంధీ ముఖ చిత్రాలను అద్భుతంగా చెక్కినందుకు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఇటీవల గాంధీ జయంతిని పురస్కరించుకుని చాక్‌పీస్‌పై మూడు వైపులా మహాత్ముడి చిత్రాన్ని చెక్కాడు. ఒకవైపు ఐదు బొమ్మల చొప్పున మూడు వైపులా 15 బొమ్మలను చెక్కాడు.
ఇందుకోసం మూడు రోజులు వెచ్చించాడు. చెక్కిన మహాత్ముడి చిత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ఎంపికైనట్లు సమాచారం వచ్చిందని కళాకారుడు నీలం శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాసులు కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. - కురవి