సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల క్రితం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగువారు మాతృభూమిని ముద్దాడేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఉద్యోగం లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ పూర్వతరం వారి వారసులు ఎంతో మంది ఇప్పుడు మహాసభల కోసం హైదరాబాద్ రాబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి రానివారు కూడా ఈ తెలుగు ఉత్సవాల పేరుతో మళ్లీ స్వదేశాగమనం చేయనున్నారు.
అమెరికా మొదలుకుని ఆస్ట్రేలియా వరకూ దాదాపు 70 దేశాల నుంచి సుమారు 410 మంది మహాసభలకు రానున్నారు. వెయ్యేళ్ల తెలుగు భాషను తలచుకునే మహాసభలను భాషాభిమానులు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును అద్భుతంగా నిర్వహించి భేష్ అనిపించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదే ఊపులో దేశం దృష్టిని ఆకర్షించేలా మహాసభలను నిర్వహించబోతోంది.
అహో అనిపించేలా.. బాణసంచా..
ఒలింపిక్స్ ఆకర్షణ అనగానే ఠక్కున మదిలో మెదిలేది ప్రారంభ వేడుకలో నిర్వహించే బాణసంచా వెలుగులే.. భారీ వ్యయంతో లయబద్ధంగా సాగే బాణసంచా కార్యక్రమాన్ని వీక్షించి ప్రపంచవ్యాప్తంగా జనం మైమరిచిపోతారు. ఈ స్థాయిలో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో బాణసంచా కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ బాణసంచా కార్యక్రమం జరగనుంది. తొలిరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలను ప్రారంభించినట్టు ప్రకటించగానే దాదాపు 15 నిమిషాల పాటు ఏకధాటిగా బాణసంచా వెలుగుజిలుగులు ఉంటాయి.
చివరిరోజు సభలకు బాణసంచా వెలుగులతోనే ముగింపు పలకనున్నారు. ప్రారంభ వేడుక సందర్భంగా లక్ష వాట్ల ఆడియో సిస్టమ్ నుంచి సంగీత తరంగాలు వెలువడుతుండగా, వాటికి అనుగుణంగా ఆకాశంలో అగ్నిపూల వాన కురుస్తుంది. రూ.రెండున్నర కోట్ల వ్యయం కాగల ఈ భారీ ఈవెంట్‌కు హెచ్‌ఎండీఏ టెండర్లు పిలిచింది. దేశంలో పేరుగాంచిన సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉంది. గతంలో ఆఫ్రోఏషియన్ గేమ్స్ సందర్భంగా గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ఫైర్‌వర్క్స్ దేశం దృష్టిని ఆకర్షించాయి.
ఇప్పుడు వాటిని తలదన్నే రీతిలో ఒలింపిక్స్ స్థాయిలో ప్రారంభ వేడుక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కుదిరితే లేజర్‌షో కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వెరసి ఏ రాష్ట్రంలోనూ స్థానిక ఉత్సవాల్లో ఇప్పటి వరకు కనిపించని భారీతనం ప్రత్యక్షమయ్యేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్టీసీ బస్సులు అందుబాటులో..
మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చేవారు హోటళ్లకు, వేదికల వద్దకు చేరుకునేందుకు వీలుగా 200 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. విమానాశ్రయం నుంచి మల్టీయాక్సల్ గరుడ ప్లస్ బస్సులు నాలుగు సిద్ధంగా ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి వచ్చే వారి కోసం వజ్ర ఏసీ మినీ బస్సులు, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి అద్దె చెల్లిస్తుంది. ఇక పేర్లు నమోదు చేసుకున్న వారికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేయగా.. మిగతావారికి చవక ధరలకు భోజనం దొరికేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టేడియంలో భోజనాల కోసం 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాలు తక్కువ ధరలకే సిద్ధంగా ఉంటాయి. 25 పుస్తక స్టాళ్లు, నాణేలు, శాసనాలు, వస్త్రాల స్టాళ్లు కూడా ఉంటాయి.
విదేశీ ప్రతినిధులకు పెద్దపీట..
ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో విదేశీ ప్రతినిధుల సంఖ్య చాలా పలుచగా ఉండేది. ఈసారి విదేశీ కళ ఉట్టిపడేలా మహాసభలు నిర్వహించాలని ఆది నుంచి భావిస్తున్న సీఎం ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో వివిధ దేశాల్లోని తెలుగు సంఘాలను కలుపుకుని ప్రవాస తెలు గువారు సభలకు భారీ సంఖ్యలో హాజరయ్యే లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 70 దేశాల నుంచి 410 మంది మహాసభలకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపినట్టు అధికారులు చెపుతున్నారు. అయితే, విదేశీయులు అంతగా ఆసక్తి చూపకపోవటం అధికారులను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో ప్రవాస తెలుగు వారు తప్ప విదేశీయుల హాజరు నామమాత్రమే కానుంది.
Comments
Please login to add a commentAdd a comment