సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై పెత్తనం ఉండేలా కృష్ణా బోర్డు తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందుకోసం రూపొందించిన వర్కింగ్ మ్యాన్యువల్‌పై బోర్డు ఈ నెల 30న ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించనుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం గురువారం లేఖ రాశారు.
ఇరు రాష్ట్రాలు ఆమోదిస్తే మ్యాన్యువల్‌ను కేంద్ర జలవనరులశాఖ ఆమోదానికి పంపుతామన్నారు. దానికి ఆమోదం లభిస్తే కృష్ణా బోర్డుకు సర్వాధికారాలు దక్కనున్నాయి. మ్యాన్యువల్‌లోని మార్గదర్శకాల ప్రకారం బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల విషయంలో ఏ పనులు చేయాలన్నా అనుమతి తప్పనిసరి. వాటి అంచనాలను బోర్డుకు అందించాల్సి ఉంటుంది. కృష్ణా బేసిన్‌లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చు. కానీ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం బోర్డు అనుమతి తప్పనిసరి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకూ కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉంటుంది. వీటిని పరిశీలిస్తే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయన్నది స్పష్టమవుతోంది.
పరిష్కారం లభించకుంటే అపెక్స్‌కు..
బోర్డు, కమిటీల స్వరూపం, అపెక్స్ కౌన్సిల్ భేటీలకు సంబంధించి బోర్డు మార్గదర్శకాలు ఖరారు చేసింది. దీని ప్రకారం చైర్మన్, సభ్య కార్యదర్శి, కేంద్రం నియమించే జల విద్యుత్ నిపుణుడు, ఇరు రాష్ట్రాల జలవనరులశాఖల కార్యదర్శులు, ఈఎన్‌సీలు బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండుసార్లు బోర్డు సమావేశం నిర్వహించాలి. ప్రత్యేక పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. సంప్రదింపుల ద్వారానే నీటి కేటాయింపులు చేయాలి. ఒకవేళ ఓటింగ్ అవసరమైతే బోర్డు సభ్యులకు ఒక్కో ఓటు ఉంటుంది. సరిసమానంగా ఓట్లు వచ్చినప్పుడు చైర్మన్ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పరిష్కరించలేని వివాదాలను అపెక్స్ కౌన్సిల్ పరిశీలనకు బోర్డు నేరుగా పంపవచ్చు. అపెక్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించే స్వాతంత్య్రం ఇరు రాష్ట్రాలకూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment