సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ రూపొందించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆమోదించారు. దాంతో.. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి కేంద్ర జల్ శక్తి శాఖకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 15న వెలువడే అవకాశం ఉంది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు విభజన చట్టం సెక్షన్–85 (1) ప్రకారం 2014లో బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రం.. ఇప్పటిదాకా పరిధిని నోటిఫై చేయలేదు.
బోర్డు పరిధిని ఖరారు చేస్తూ రూపొందించిన నివేదికను నాలుగు నెలల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు కేంద్ర జల్ శక్తి శాఖ పంపింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజ్‌కుమార్ బళ్లా ఆదేశాల మేరకు గురువారం బోర్డు చైర్మన్ పరమేశం, సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కేంద్ర హోం శాఖ, జల్ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్‌కుమార్ బళ్లా, పంకజ్‌కుమార్ బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి, సభ్యులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఇచ్చిన నివేదికను సమీక్షించిన అమిత్‌షా.. బోర్డు పరిధిని నోటిఫై చేసేందుకు ఆమోదం తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టు
పెత్తనమంతా బోర్డుదే..!
కృష్ణా బోర్డు పరిధిని కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫై చేసిన వెంటనే దిగువ కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ దాని అజమాయిషీ కిందకు వస్తాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల స్పిల్ వేలతోపాటు జల విద్యుత్ కేంద్రాలు, కాలువలకు నీరు విడుదల చేసే ఇన్‌లెట్లు, ఎత్తిపోతల పథకాల పంప్ హౌస్‌లు, తాగు నీటి పథకాలు, జల విద్యుదుత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వద్ద పని చేస్తున్న ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి సంవత్సరం ప్రారంభంలో బోర్డు సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తారు. మరో ఆరు నెలల తర్వాత బోర్డు సభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. నీటి లభ్యత ఆధారంగా.. బోర్డు త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై వాటా మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది. త్రిసభ్య కమిటీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బోర్డు రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తుంది. దీని వల్ల ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు..
కృష్ణా పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మ్యాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. దాంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచుగా ఉత్పన్నమవుతున్నాయి. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు సరపడా ఉన్నప్పటికీ, కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం. దీని వల్ల శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల బోర్డు కేటాయింపులు ఉన్నా సరే.. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం)–2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వాదనను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు నివేదిక కూడా పంపారు.
512:299 టీఎంసీల నిష్పత్తిలో పంపిణీ
ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 812 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం నోటిఫై చేసేదాకా ఇదే నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment