
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చలి గండం పొంచి ఉంది. ఉత్తరభారతం నుంచి వీస్తోన్న శీతగాలుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. దీంతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 14.5 డిగ్రీలకు పడిపోతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. దీంతో నగరంలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ..ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 25లో చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో బొగ్గులకుంపటి ఏర్పాటు చేసుకున్న బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజులు ఊపిరి ఆడక మరణించిన ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
చలి తీవ్రతతో నగరంలోసాయంత్రం, తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే గురువారం నుండి రాత్రి ఉష్ణోగ్రతలు మరో 0.5 డిగ్రీలు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తీ వ్రత శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో నగరంలో ఆకాశమంతా మేఘావృతమవటంతో గాలి నాణ్యత కూ డా ఓ మోస్తరుగానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలిలో తేమ శాతం అతి తక్కువగా ఉండటంతో చలి గాలుల తీవ్రత అధికంగా ఉండి చర్మం చిట్లటంతో పాటు శ్వాస సం బంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వై ద్యులు హెచ్చరించారు. పిల్లలు, గుండె, శ్వాస సం బంధమైన వ్యాధులున్న వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు పేర్కొన్నారు.