వేములవాడ, న్యూస్‌లైన్ : ఎములాడ రాజన్న కోటిశ్వరుడయ్యాడు. శతాబ్దాల ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భక్తులు భారీ కానుకలు సమర్పించడంతో ఆలయ ఆదాయం రూ. కోటి దాటింది. 27 రోజుల ఆదాయానికి సంబంధించి బుధవారం ఆలయ ఆవరణలో గల ఓపెన్‌స్లాబ్‌లో హుండీలెక్కించారు. రాత్రి పదిగంటలకు లెక్కింపు పూర్తయ్యే సరికి స్వామివారి ఆదాయం రూ. 1,01,73,342 సమకూరినట్లు లెక్కతేలింది. 350 గ్రాముల బంగారం, 12.500 కిలోగ్రాముల వెండి సమకూరిందని, వీటిని తూకం వేయించి స్వామివారి ఖజానాకు జమచేశామని ఈవో కృష్ణాజీరావ్ వెల్లడించారు.
తెరవని మరో 4 హుండీలు..
తెరిచిన హుండీల్లోని సొమ్ము లెక్కింపునకే రాత్రి పది గంటలైంది. ఇంకా నాలుగు హుండీలు తెరవాల్సి ఉన్నా సిబ్బంది అలసటకు గురి కావడంతో అధికారులు లెక్కింపును ఆపేశారు. మిగిలిన నాలుగు హుండీల్లో మరో రూ. రెండు లక్షల వరకు సమకూరవచ్చని ఆలయ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వెలుగుచూసిన భారీ కానుకలు..
హుండీ లెక్కింపులో భారీ కానుకలు వెలుగుచూశాయి. రూ . 2 లక్షల నగదుతో కూడిన ఓ మూట, 200 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు కలిగిన కవరు గుర్తించారు. మిగతా బంగారు కానుకలతోపాటు ఓ అరకిలో వెండి కడ్డీ కనిపిం చింది. హుండీ లెక్కింపును ఆలయ ఈవో సీ.హెచ్.వీ. కృష్ణాజీ రావ్, ట్రస్టుబోర్డు సభ్యులు అరుణ్ తేజాచారి, సగ్గుపద్మా దేవరాజ్, బాలరాజు, ఏఈవోలు ఉమారాణి, హరికిషన్, గౌరీనాథ్, దేవేందర్ తదితరులు పర్యవేక్షించారు.
రూ.కోటి దాటిన రాజన్న ఆదాయం
Published Thu, May 29 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement