గోలివాడలో ఉద్రిక్తత | Tension in Golivada | Sakshi
Sakshi News home page

గోలివాడలో ఉద్రిక్తత

Published Sat, May 6 2017 2:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

గోలివాడలో ఉద్రిక్తత - Sakshi

గోలివాడలో ఉద్రిక్తత

- ప్రాజెక్టు పనులకు అడ్డుతగులుతున్నారని 27మంది అరెస్టు
- నిర్వాసితులను పరామర్శించిన సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి


రామగుండం/జ్యోతినగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మిస్తున్న బ్యారేజ్‌ పనుల వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిహారం చెల్లించకుండానే తమ భూముల్లో పనులను ఎలా చేపడతారని నాలుగు రోజులుగా నిర్వాసితులు పని ప్రదేశంలో వంటావార్పుతో నిరసన తెలుపుతూ రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు. దీంతో శుక్రవారం స్థానిక పోలీసులు 27 మందిని అరెస్టు చేసి రామగుండం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న వీరిని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు.

వీరిని ఎందుకు అరెస్టు చేశారని సీఐ వాసుదేవరావును ప్రశ్నించారు. పనులకు అడ్డు తగులుతున్నారని ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాజెక్టు పనులకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నచోటుకు వెళ్లారు. అక్కడ ఇరిగేషన్‌ అధికారులను పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నందున హెచ్చార్సీని ఆశ్రయిస్తామన్నారు. పనులను ఆపేవరకు కదలబోమని అక్కడే నిర్వాసితులతో కలిసి బైఠాయించారు.

వారు ఎంతకీ అక్కడ నుంచి వెళ్లకపోవడంతో పోలీసులు జీవన్‌రెడ్డిని అరెస్టు చేసి గోదావరిఖనిలోని ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జీవన్‌రెడ్డిని వదిలివేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు రాజీవ్‌ రహదారిపై రాస్తారోకోకు దిగాయి. శుక్రవారం రాత్రి జీవన్‌రెడ్డిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే సీఎం కేసీఆర్‌ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు. కేవలం 240 ఎకరాల పట్టా భూముల కోసం ఇంత రాద్దాంతం అవసరమా? అని ప్రశ్నించారు. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లిస్తే, రూ.50 కోట్లతో పంచాయతీ తీరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement