
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి నెల ముగియకముందే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు అధికంగా రికార్డు
అయ్యాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో రెండు డిగ్రీలు ఎక్కువగా 36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, మెదక్, నిజామాబాద్, రామగుండంలలో 35 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు
అయ్యాయి. పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే ఒక డిగ్రీ చొప్పున అధికంగా నమోదవుతోంది. భద్రాచలం, ఖమ్మంలలో 21 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రామగుండంలలో 20 డిగ్రీల
చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడే 36–37 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంపై అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా ఫిబ్రవరి నెలలోనూ కాస్తంత చలి వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇక అసలైన వేసవి తడాఖా ఎలా ఉంటుందా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.