ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సతీమణి రచన ఆరోపణ
- నెలకు లక్ష మామూళ్లు ఇవ్వనందుకే నా భర్తను టార్గెట్ చేశారు
- శిరీష ఆత్మహత్యకు నా భర్త కారణమైతే ఆమె ఎందుకు వెల్లడించలేదు
ఆలేరు: మామూళ్లు ఇవ్వనందుకే తన భర్తను టార్గెట్ చేసి, హత్య చేసి, ఇప్పుడు వివాహేతర సంబంధం అంటగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుకునూర్‌పల్లి ఎస్‌ఐ పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి సతీ మణి రచన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరులో శని వారం ఆమె తన అత్త వెంకటమ్మతో కలసి ‘సాక్షి’తో మాట్లాడారు. నెలకు లక్ష రూపాయలు మామూళ్లు ఇవ్వాలని, ప్రతి స్టేషన్ నుంచి ఇస్తున్నప్పుడు నువ్వెందుకు ఇవ్వవని ఏసీపీ గిరిధర్ వేధిస్తున్నాడని తమకు చెప్పేవాడని ఆమె అన్నారు. అయితే, నేను ఎక్కడ నుంచి తెచ్చివ్వాలని, లంచాలు తీసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదని ఏసీపీతో తన భర్త చెప్పాడని ఆమె తెలిపారు.
దీంతో అతడిపై కక్షగట్టి టార్గెట్ చేశారని ఆమె ఆవేదన చెందారు. నా భర్త ఆత్మహత్యకు పాల్పడితే ఒంటిపై ఎలా గాయాలయ్యాయని, చేతులు తొడలపై వాలి ఉన్నాయని, ఆత్మహత్య చేసుకుంటే జేబులో సూసైడ్ నోటు ఉండాలని, ఎప్పుడు సోఫాలో కూర్చునే వ్యక్తి ప్లాస్టిక్ కుర్చీలో ఎలా కూర్చుంటాడని, హత్య చేసి కూర్చోబెట్టారని రచన ఆరోపించారు. ఆయన జేబులో సూసైడ్‌నోట్ ఉం డాలని, చేతికి ఉన్న రింగులు, బ్రేస్‌లెట్, మెడలోని గోల్డ్ చైన్, బీరువాలో నగదు, ఏటీఎం కార్డులు కూడా మాయం చేశారని ఆమె వాపోయారు. ప్యాంట్ జేబులో పర్సు కూడా లేదని, కాల్చుకున్న వ్యక్తి కుర్చీలో అలానే ఎలా కూర్చుంటాడన్నారు. ల్యాప్‌టాప్‌లో గతంలో అక్కడే చనిపోయిన ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, కుకునూరుపల్లి పీఎస్ సమాచారం ఉండగా, దాన్ని తొలగించారని చెప్పారు.
శిరీషపై అఘాయిత్యం కట్టుకథే..
శిరీష ఆత్మహత్యకు తన భర్తే కారణమైతే ఆమె ఆ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని, శిరీష స్టేషన్ కు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉంటాయని, అవి బయటకు ఎందుకు రాలేదన్నారు. తన భర్త శిరీషపై ఎలాంటి ఆఘాయిత్యానికి పాల్పడలేదని కావాలనే కట్టు కథ అల్లుతూ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుకునూరుపల్లి పీఎస్‌లో జరిగిన విషయాలన్నీ కానిస్టేబుళ్లకు తెలు సని.. వాళ్లు నోరు మెదపకుండా కొందరు అధికారులు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి అయితే పండ్లు, టిఫిన్ ఎందుకు తెప్పించుకుంటాడని ఆమె వాపోయారు. త్వరలో ములుగుకు బదిలీ అయ్యే అవకాశముందని.. ఇక్కడి ఏసీపీ గిరిధర్ ములుగుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని తన భర్త చెప్పాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కౌడిపల్లి పీఎస్‌లో ఎస్సైగా పనిచేసేటప్పుడు తనకు ఫ్రీగా ఉండేదని, ఇక్కడ పనిఒత్తిడి అధికమైందని చెప్పారన్నారు. తన కుమారున్ని వదిలిపెట్టి ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి కాదని, ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటే.. తనకు సమాచారమిచ్చేవాడని రచన అన్నారు. కాగా, తన భర్త మృతిపట్ల సీఎం కేసీఆర్ కనీసం సంతాపం తెలపకపోవడం బాధాకరమన్నారు.
నన్ను బంధించారు: ఎస్‌ఐ తల్లి వెంకటమ్మ
తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా టీవీ ల్లో చూసి తెలుసుకున్నామని, కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ప్రభాకర్‌రెడ్డి తల్లి వెంకటమ్మ వాపోయింది. కొడుకు శవాన్ని చూసేందుకు వెళ్తే తనను పోలీసులు సిద్దిపేటలో ఒంటరిగా బంధించారని ఆమె రోదించింది. క్వార్టర్స్‌లోకి ప్రవేశించే సమయంలో ఒకరిద్దరు వ్యక్తులు సూట్‌కేసులు తీసుకెళ్లడాన్ని చూశానని చెప్పారు. తన కుమారుడు నిజాయితీపరుడని న్నారు. ఏసీపీ గిరిధర్‌కు నెలకు లక్ష రూపాయలు ఇవ్వనందుకే ఇంతటి ఘోరం జరిగిందని విలపించారు.
ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ
కుకునూర్‌పల్లి పోలీస్టేషన్‌లో విచారణ జరుపుతున్నాం : డీఎస్పీ తిరుపతన్న
కొండపాక (గజ్వేల్): సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ అధికారిగా నియామకమైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శనివారం కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఘట నపై కానిస్టేబుళ్లను విచారించారు. ప్రభాకర్‌రెడ్డి మృతి చెందడానికి ఒక రోజు ముందు నుంచి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను, హోంగార్డులను వేర్వేరుగా విచారించారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి కుకునూరుపల్లి పోలీస్టేషన్‌కు ఏ సమయంలో ఎంతమంది వచ్చారు? అనే విషయాలను ఆ రోజు వాచ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌లను అడిగి తెలుసుకున్నారు. విలేకరులు పోలీస్టేషన్‌కు వెళ్లగా ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి మృతి చెందిన విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నామని విచారణ అధికారి తిరుపతన్న చెప్పారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న శిరీష ఘటనలో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మృతి చెందాడా..? అనే కోణంలో విచారణ చేసినట్లు సమాచారం.