తాటికొండ తొలివరం
- ఎంజీఎం ఫైలుపై మొదటి సంతకం
- మాతా శిశు సంరక్షణ వార్డుకు 120 అదనపు పడకల మంజూరు
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ
- జిల్లా అభివృద్ధిపై సచివాలయంలో నేడు సమీక్ష
- సంపూర్ణ సమాచారంతో రావాలని అధికారులకు ఆదేశం
సాక్షి, హన్మకొండ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తన సొంత జిల్లాకు తొలి వరమిచ్చారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రిగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వెంటనే జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ స్మారక(ఎంజీఎం) ఆస్పత్రిలో మాతా శిశు సంరక్షణ వార్డుకు 120 అదనపు పడకలను మంజూరు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. రాజయ్య వృత్తిపరంగా పిల్లల వైద్యుడు... కేఎంసీ విద్యార్థి. అంతే కాకుండా తాను విద్యనుభ్యసించిన ఓరుగల్లుపై ప్రధాన దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎంలో శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకుసాగారు. 58 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎంజీఎం ఆస్పత్రి క్రమక్రమంగా 650 పడకలుగా అభివృద్ధి చెందింది. 2006లో వేయి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయిలో వైద్యం అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఉపముఖ్యమంత్రిగా రాజయ్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలో నాలుగు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యమందించే ఫైలుపై ఆయన తొలిసంతకం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. ఉపముఖ్యమంత్రి స్థాయి పదవి జిల్లాకు దక్కడం ఇదే తొలిసారి. దీంతో జిల్లా అభివృద్ధి వేగం పుంజుకుంటుందనే ఆశలు ప్రజల్లో చిగురించాయి.
దీనికి తగ్గట్లుగా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉపముఖ్యమంత్రి రాజయ్య జిల్లా సమస్యలపై దృష్టి పెట్టారు. రాజకీయాల్లోకి రాక ముందు పిల్లల వైద్యుడిగా దీర్ఘకాలం పాటు ఆయన సేవలు అందించారు. ఇదే సమయంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో పిల్లల వార్డు ఏళ్ల తరబడి సమస్యలతో సావాసం చేస్తోంది. మాతాశిశు సంరక్షణా కేంద్రం ఉన్నప్పటీకీ అత్యాధునిక సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్డులో 50 పడకలు ఉన్నాయి.
ఇక్కడికి వచ్చే రోగులకు ఈ పడకలు సరిపోవడం లేదు. వైద్యుడిగా తనకున్న అనుభవం, ఇక్కడి సమస్యలపై అవగాహాన ఉన్న ఉపముఖ్యమంత్రి ఎంజీఎం పిల్లల వార్డుకు 120 పడకలను నూతనంగా మంజూరు చేశారు.అంతేకాదు... అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత 14వ తేదీన ఎంజీఎం ఆస్పత్రి సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎంజీఎంకు మంత్రి రాజయ్య మరో 120 పడకల మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయడంపై ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, ఆర్‌ఎఓం నాగేశ్వర్‌రావు, పిడియాట్రిక్ హెచ్‌ఓడీ బలరాం హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ సైవలైన కార్డియాలజీ, న్యూరోసర్జన్, న్యూరో ఫిజీషియన్, ఎండ్రోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, వాస్క్యులర్ సర్జన్ వంటి సేవలను అందుబాటులోకి తెస్తానని, ఎంజీఎంను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం శుభసూచకమని వారు అన్నారు.
నేడు హైదరాబాద్‌లో సమీక్ష
తెలంగాణ రాష్ట్ర శాసన సభ తొలి సమావేశాలు జూన్ 9 నుంచి 12 వర కు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజయ్య ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధిపై ఆలస్యం జరగకుండా ఉండాలనే సంకల్పంతో అసెంబ్లీ సమావేశాలకు ముందుగా సెలవు రోజైన ఆదివారం ఆయన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా జిల్లా అధికారులు సంపూర్ణ సమాచారంతో హైదరాబాద్ రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, డి బ్లాకులో ఉదయం 11:00 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం నివేదికలు సిద్ధం చేసింది. ఈ సమావేశానికి కలెక్టర్ జి.కిషన్, అదనపు జేసీ కె.కృష్ణారెడ్డి సహా పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.