ప్రత్యామ్నాయ రాజకీయాలకు స్వేచ్ఛ కావాలి
విరసం నేత వరవరరావు
హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయాలపై తీవ్రమైన అణచివేత కొనసాగుతోందని విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు ఆవేదన వ్యక్తంచేశారు. 4 దశాబ్దాలుగా అమలవుతున్న ఎమర్జెన్సీ నిర్బంధాన్ని వ్యతిరేకిద్దాం అనే పేరుతో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం సభ నిర్వహించారు. కార్యక్రమంలో వరవరరావు మాట్లాడుతూ.. 1948లోనే తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ అనుభవించారని గుర్తుచేశారు.
వర్గ సమాజం, వర్గ పోరాటంలో ఎమర్జెన్సీ ఒక పేజీ మాత్రమేనన్నారు. నక్సల్‌బరి రాజకీయాల ప్రభావంతో అవినీతి వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయని, ఈ ఉద్యమాలలో పార్లమెంటరీ రాజకీయాలను విశ్వసించే వారు సైతం పాల్గొన్నారన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు స్వేచ్ఛ కావాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేటప్పుడు సెక్షన్ 8 కు ఒప్పుకోకుండానే తెలంగాణ ఇచ్చిందా.. హైదరాబాద్‌పై అధికారాలు పదేళ్లు ఉన్న విషయాన్ని ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఈ రోజు సెక్షన్ 8పై గవర్నర్ అధికారాలపైనా... ప్రజలను మభ్యపెట్టడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారితనం లేకుండా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వికారుద్దీన్‌ను హత్య చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నా ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇంకా నిలబడి ఉన్నాయన్నారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి ముందుకు పోవడానికి అనేక ఉద్యమాలు జరిగినా సఫలం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ తర్వాతనే పౌరహక్కుల సంఘం నేతలు ఎక్కువగా హత్యలకు గురయ్యారన్నారు. సభకు పౌర హక్కుల సంఘం నగర అధ్యక్షుడు పీఎం రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు.