తేలిన లెక్క
లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్ మొత్తం విస్తీర్ణం 6,575 చదరపు గజాలు. దాంట్లో భవన సముదాయాలు 4,895 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి.
40ఏళ్ల క్రితం గోషామహల్‌లో నిర్మించిన సరూర్‌నగర్ ఆర్డీఓ ఆఫీస్ 10,890 చదరపు అడుగుల్లో ఉంది. భవనం కాకుండా సుమారు 3వేల గజాల ఖాళీ స్థలం ఉంది.
ఖైరతాబాద్‌లోని 2.425 ఎకరాల్లో జెడ్పీ ప్రాంగణం ఉండగా, ఇది ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఉంది.
బుద్వేల్‌లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం 1500 గజాల్లో ఉంది.
కొలిక్కివచ్చిన సర్కారీ స్థిరాస్తుల వివరాలు
శాఖాధిపతుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక
ఆగమేఘాల మీద కొలతలు,బిల్టప్ ఏరియా అంచనాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ స్థిరాస్తుల లెక్క కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని సర్కారీ భవంతుల సమస్త సమాచారాన్ని బుధవారంలోపు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద ప్రభుత్వ భవనాలను కొలిచి సమగ్ర వివరాలను సేకరించిన యంత్రాంగం.. ఆయా శాఖాధిపతుల ద్వారా సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది.
భవన విస్తీర్ణం, సర్వే నంబర్, లీజులు, ఆక్రమణలు, కోర్టు కేసులు, ప్రధాన మార్గానికి ఎంత దూరం? తదితర అంశాలపై రూపొందించిన నమూనాకు అనుగుణంగా వివరాలను పొందుపరిచింది. జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీంట్లో భాగంగానే సర్కారు ఆఫీసుల బిల్టప్ ఏరియా లెక్క తేల్చిన ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలువైన ప్రదేశాల్లో కొలువుదీరిన కార్యాలయాల స్థలాలను విక్రయించడం ద్వారా ఖజానా నింపుకొనే యోచన కూడా చేస్తున్న ప్రభుత్వం.. సమస్త సమాచారాన్ని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.