కీసర: ఆర్టీసీ బస్సు బైకును వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
కీసర: ఆర్టీసీ బస్సు బైకును వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సురేష్(30), శంకర్‌లు లారీ డ్రైవర్లు.
వీరి లారీ మరమ్మతుకు గురికావడంతో బుధవారం నాగారంలోని ఓ షెడ్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు బైకుపై నాగారం గ్రామంలోకి వెళ్లి తిరిగి షెడ్డుకు వస్తున్నారు. ఈక్రమంలో నాగారం శివాలయం దగ్గర వెనుక నుంచి వేగంగా వచ్చిన కుషాయిగూడకు చెందిన ఈసీఐఎల్-గోపాలపురం రూట్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
శంకర్‌కు తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.