నేడు సీఎం రాక
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మోడల్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన
ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకూ..
మినీ ట్యాంక్‌బండ్‌గా.. పాండవుల చెరువుకు శ్రీకారం
గజ్వేల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్ నగర పంచాయతీలో పర్యటించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత మార్చి 12న ఇక్కడ పర్యటించి పట్టణానికి కొత్తరూపు తీసుకురావడానికి పలు ప్రతిపాదనలకు ఆదేశించిన కేసీఆర్ వాటికి కార్యరూపమిస్తూ ఆ పనులకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు.
ఆయన పర్యటనకు సంబంధించి ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో మరోసారి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వివిధ బలగాలు భారీగా మోహరించాయి.
ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్..
► ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం గజ్వేల్ చేరుకుంటారు.
► తొలుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మించతలపెట్టిన వంద పడకల ఆసుపత్రికి, పాలశీతలీకరణ కేంద్రం వెనుక భాగంలోని స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
► కస్తుర్బాగాంధీ పాఠశాల ప్రాంగణంలోని 20 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో బాలికల కోసం టెన్త్ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు, పాలిటెక్నిక్‌లోని 45 ఎకరాల ప్రాంగణంలో బాలుర కోసం టెన్త్ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు, హాస్టళ్లతో కూడిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి, హౌసింగ్ బోర్డు మైదానంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
► సంగాపూర్‌లో ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ వెనుక భాగంలో ఉన్న 68 ఎకరాల్లో మోడల్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన.
► రూ.8.50 కోట్లతో అభివృద్ధి చేయనున్న పాండవుల చెరువు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
► రాజిరెడ్డిపల్లిలోని రాజీవ్ రిక్రియేషన్ పార్కు సందర్శన.. విలేకరుల సమావేశం.
► మధ్యాహ్నం ఒంటిగంటకు ములుగు మండలం మర్కుక్ పీహెచ్‌సీ తదితర నిర్మాణాలకు శంకుస్థాపన.