
తెలంగాణ జాతిపిత జయశంకర్
మేడ్చల్: దివంగత ఉద్యమ కెరటం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపితలాంటివారని కోదండరాం అన్నారు. జిల్లా తూర్పు జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో శనివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కోదండరాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏ ఒక్కరివల్లో రాలేదని ప్రజలంతా ఐక్యంగా చేసిన పోరాటాలతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన లేకపోవడం తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు.
జయశంకర్ చరిత్ర, తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం లాంటి వ్యక్తులు ప్రభుత్వ సలహాదారులుగా ఉండాలని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. సభకు మేడ్చల్‌కు చెందిన వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా జేఏసీ నాయకులు చల్మారెడ్డి, సంజీవరావు, మేడ్చల్ జేఏసీ నాయకులు రాంచంద్రారెడ్డి, హరికిషన్, మల్లారెడ్డి, పాండు, బాల్‌రాజ్, లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.