లక్షకుపైగా నిరుద్యోగుల్లో నైరాశ్యం
మంచిర్యాల సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో విస్తరించిన బొగ్గు గనుల్లో ఖాళీగా ఉన్న 78 క్లరికల్ పోస్టులు భర్తీ చేయడానికి సింగరేణి యాజమాన్యం జూన్, 2013న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాదైంది. అయినా యాజ మాన్యం నుంచి స్పందన లేదు.
ఉద్యోగంపై ఆశతో లక్షకుపైగా నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒకే రోజు పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన సందర్భాలు సింగరేణి చరిత్రలో ఉన్నాయి. పక్కా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సింగరేణి సంస్థ క్లరికల్ నియామకం విషయంలో జాప్యం చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కారణం..
అధికారులు ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన యాజమాన్యానికి భారమైంది. సంస్థ పరంగా ఉద్యోగులను భర్తీ చేసుకోవడంలో సింగరేణి సంస్థ దరఖాస్తులు స్వీకరించడం నుంచి మొదలుకుని ఎంపిక ప్రక్రియ పూర్యయ్యే వరకు అన్నీతానై పనులను పూర్తిచేసుకుంటుంది.
లక్షకు పైగా దర ఖాస్తులు రావడంతో దరఖాస్తుల పరిశీలనతోపాటు ప్రశ్నపత్రాల తయారు, పరీక్ష నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల తయారీ, హాల్ టికె ట్ల పంపిణీ వంటి సమస్యలు సంస్థకు భారమైంది. సింగరేణి సంస్థ సంస్కరణల పేరిట ఖర్చు తగ్గించుకోడానికి ఆశపడుతుంది. 78 ఉద్యోగాల నియామకంలో ఖర్చు భారం కావడంతోపాటు, దరఖాస్తుల పరిశీలనతోపాటు ఎంపిక ప్రకియ వరకు సిబ్బంది తగినంత లేకపోవడం కూడా ప్రధాన కారణం కనబడుతోంది.
నోటిఫికేషన్
జూన్, 2013న 78 క్లరికల్ పోస్టులకు సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని డిగ్రీతోపాటు కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన డిప్లొమా సర్టిఫికెట్‌ను అర్హతగా ప్రకటించారు. 01-03-2013 నాటికి 30 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు. ఇందులో 63 స్థానికులకు, 15 స్థానికేతరులక కేటాయించారు. 26 జూలై, 2013 నుంచి 9 ఆగస్టు, 2013 వరకు ఆన్‌లైన్ ద్వార దరఖాస్తులు తీసుకున్నారు.
ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు ప్రింట్ తీసుకోడానికి ఆగస్టు 19వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నామని యాజమాన్యం తెలిపింది. లక్షకు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రింట్ తీసుకున్న నిరుద్యోగులు పరీక్ష తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా? హాల్‌టికెట్టు ఎప్పుడు వస్తుందా? అని అనాటి నుంచి ఈనాటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు.
చిగురిస్తున్న ఆశలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుందని యాజమాన్యం నియామకంలో ఆలస్యం చేసిందనే వాదన కూడా ఉంది. స్థానికేతరులకు 15 పోస్టులు ఉన్నవి. వీటి కోసం ఆంధ్ర ప్రాంత నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడ హాల్ టికెట్టు పంపి, పరీక్ష నిర్వహిస్తే అనవసరంగా గొడవలు వస్తాయని యాజమాన్యం భావించి పరీక్ష నిర్వహణలో ఆలస్యం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఖాళీల సంఖ్య మరో 30 పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దీంతో ఖాళీల సంఖ్య పెరిగితే నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతాయి. స్థానికేతరుల కోటా కూడా పెరుగుతుంది. స్థానికేతరుల కోటాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సింగరేణి విస్తరించని తెలంగాణలోని ఆరు జిల్లాల నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోడానికి అవకాశాలు ఉంటాయి. తద్వార మొత్తం పోస్టులు కూడా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితులను కొత్త ప్రభుత్వానికి వివరిస్తే కొత్త నోటిఫికేషన్ ప్రకటించడానికి కూడా ఒప్పుకుంటారు.
క్లరికల్ పోస్టుల భర్తీలో జాప్యం
Published Mon, Jul 21 2014 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement