జాప్యాన్ని సహించేది లేదు
రహదారుల పనులపై అధికారులకు జూపల్లి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యాన్నీ ఉపేక్షించేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమాల పురోగతిపై అన్ని జిల్లాల ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా చేపట్టిన రహదారులు, నాబార్డ్ నిధులతో చేపట్టిన వంతెనల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గతేడాది మంజూరైన పనులన్నింటినీ పూర్తిచేయాలని అన్ని జిల్లాల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇకపై పంచాయతీ రహదారులకు అంచనాలు, సాంకేతిక అనుమతుల వంటి ప్రక్రియలను 45 రోజుల్లో పూర్తి చేయాలని, లేనిపక్షంలో సదరు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. టెండర్లు దక్కించుకొని నెలల తరబడి పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు. నాణ్యత విషయంలో తేడాలు వస్తే ఉపేక్షించబోమన్నారు. అటవీశాఖ అనుమతుల కారణంగానే రహదారుల నిర్మాణంలో జాప్యమేర్పడుతుందని కొందరు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై అటవీశాఖ మంత్రితో మాట్లాడతానని జూపల్లి తెలిపారు. తెలంగాణ రాష్ట్రమేర్పడిన ఏడాదిన్నరలోనే గ్రామ పంచాయతీల్లో రూ.5వేల కోట్లతో సుమారు 12వేల కిలోమీటర్ల మేర రహదారులను ప్రభుత్వం మంజూరు చేసిందని జూపల్లి తెలిపారు. ఇందులో సగానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలినవి మరింత వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.