సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు నగరంలో మాన్యం స్థలాలు మాయమవుతున్నాయి. అందుకు కొందరు అధికారులు పూర్తిగా సహకరిస్తుండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపులేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని నవాబుపేటలోని గిడ్డంగి వీధిలో కేబీఆర్ ఫంక్షన్, కల్యాణ మండపం ఉంది. సుమారు 300 అంకణాల్లో కల్యాణమండపం, ఫంక్షన్ హాలు నిర్మించి ఉన్నారు. ఇవి దేవాలయ మాన్యం భూములుగా స్థానికులు చెబుతున్నారు.
గతంలో కొందరు ఈ స్థలాన్ని దేవాలయానికి దానం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ప్రస్తుతం టీడీపీకి చెందిన నేత ఒకరు కూలదోశారు. వాటిలో ప్లాట్లు వేసి విక్రయానికి పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేత ఈ కల్యాణమండపం, ఫంక్షన్ హాల్‌పై కన్నుపడింది. దీంతో కొందరు అధికారులతో మంత్రాంగం నెరిపినట్లు సమాచారం. వారి సహకారంతో కొద్దిరోజులకు ముందే అందులో వివాహాలు జరపలేదు.
ఎవరైనా కల్యాణమండపం అద్దెకు కావాలని అడిగితే.. ప్రస్తుతం ఇచ్చేది లేదని నిర్వాహకులు చెప్పి పంపేసిన సంఘటనలు ఉన్నాయి. వాటిని కూలదోయక ముందే టీడీపీ నాయకుడు కార్పొరేషన్‌లో తన పలుకుబడిని ఉపయోగించి ప్లాన్ గీయించుకున్నారు. 25 ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. ఎవరికీ తెలియకుండానే తనకు తెలిసిన వారి నుంచే ప్లాట్లను కొనుగోలు చేయించటం ప్రారంభించారు. అందులోభాగంగా ప్లాట్లు రూ.లక్ష చొప్పున అడ్వాన్స్ పుచ్చుకున్నట్లు సమాచారం.
ప్లాట్లు కొనుగోలు చేయదలచిన ఇద్దరు వ్యక్తులు కల్యాణమండపం పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. దేవాలయ మాన్యం స్థలమని తేలటంతో కొనుగోలు చేయటం మానుకున్నారు. మాన్యం స్థలంలోని కల్యాణమండపం, ఫంక్షన్ హాల్‌ను పగులగొట్టి దర్జాగా విక్రయానికి పెట్టిన విషయాన్ని పత్రికల వారికి చేరవేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ.6 కోట్లకుపైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
శ్రీదేవమ్మ సత్రం ఆక్రమణ..
నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో గతంలో ప్రభుత్వాసుపత్రి ఉండేది. ఆ ఆసుపత్రికి వచ్చే వారి కోసం మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వ వైద్యులుగా పనిచేసే డాక్టర్ సుజాన్‌సింగ్ 250 అంకణాలను ప్రభుత్వానికి దానమిచ్చారు. డాక్టర్ సుజాన్‌సింగ్ రక్తసంబంధీకులు డాక్టర్ రఘునాథ్‌సింగ్ చొరవతో ప్రభుత్వానికి ఇచ్చిన స్థలంలో దశాబ్దాల క్రితం రోగులకు అటెండెన్స్ (సహాయకులు) బస చేసేందుకు, వంటవార్పు చేసుకునేందుకు ఓ సత్రాన్ని నిర్మించారు.
నగరంలో మోతుబరి కుటుంబానికి చెందిన వారి సహకారంతో మేనకూరు శ్రీదేవమ్మ పేరుతో సత్రం నిర్మించారు. ఈ సత్రం అప్పట్లో అనేకమంది రోగులకు శ్రీదేవమ్మ సత్రం ఆసరాగా నిలిచింది. అయితే ప్రభుత్వాసుపత్రిని దర్గామిట్టకు తరలించటంతో శ్రీదేవమ్మ సత్రం ఖాళీగా ఉండిపోయింది. ఈ సమయంలో పెన్నానదీ పరివాహకప్రాంతమైన పొర్లుకట్టను ఆవాసంగా చేసుకుని పలువురు పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగించారు.
1988-89లో సంభవించిన తుపాను కారణంగా పెన్నా పరివాహక ప్రాంతం నీటమునిగింది. అక్కడ నివసిస్తున్న పేదలకు ఖాళీగా ఉన్న శ్రీదేవమ్మ సత్రాన్ని అధికారులు తాత్కాలిక నివాసిత ప్రాంతం (షెల్టర్)గా ఇచ్చారు. అప్పటికే ఓ పార్టీ తరుఫున గెలుపొందిన మునిసిపల్ కౌన్సిలర్ కన్నుపడింది. దీంతో నాడు తనకు ఉన్న పలుకుబడితో ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి తన సమీప బంధువులకు, పార్టీ సానుభూతిపరులకు, తన అనుయాయులకు దీనిని కట్టబెట్టేందుకు పావులు కదిపారు. అందులో కొందరు మునిసిపల్ ఉద్యోగులు కూడా ఆక్రమణలో పాలు పంచుకున్నట్లు సమాచారం. ఎవరూ పట్టించుకోకపోవడం, చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఆ ప్రజాప్రతినిధి అండదండలతో పక్కాభవనాలు నిర్మించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే భారీభవనాలకు శ్రీకారం చుట్టా రు. దీని విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఆస్థలాలు ప్రభుత్వానివే
-వేగూరు రవీందర్‌రెడ్డి, దేవాదాయ ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్.
మీరు చెబుతున్న బుజ్జమ్మతోటలోని కేబీఆర్ కల్యాణమండపం, ఫంక్షన్ హాల్ స్థలాన్ని గతంలో దాతలు ఇచ్చారు. అవి ప్రభుత్వానికి చెందిన ఆస్తులే. అందులో ప్లాట్లు కొన్నా.. విక్రయించినా నేరం. ఆ స్థలాలను కొనుగోలు చేసిన చెల్లవు. అదేవిధంగా శ్రీదేవమ్మ సత్రం విషయం కూడా అటువంటిదే. అయితే దానికి సంబంధించిన వివరాలు లేవు. వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాము.