- పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పేదలు నివాసముంటున్న స్థలాలను వారిపేరిట క్రమబద్ధీకరించే ప్రక్రియను శ్రీరామనవమిలోగా పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నవమి తర్వాతరోజు నుంచి పట్టాలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం ఆయన రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ అదర్‌సిన్హా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కబ్జాలు లేకుండా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములు, యూఎల్సీ భూముల కోసం వచ్చిన దరఖాస్తులను వేర్వేరు కేటగిరీలుగా విభజించి క్రమబద్ధీకరించాలని సీఎం సూచించారు.
క్రమబద్ధీకరణకు అర్హమైన దరఖాస్తులు సుమారు రెండులక్షలు రాగా, ఇందులో 1.70 లక్షల దరఖాస్తులు ప్రభుత్వ భూములకు సంబంధించినవేనని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. నవమి దాటాక పట్టాల పంపిణీ చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను వేగవతం చేసేందుకు అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలిసింది.