
సీఎం స్పందించకుంటే గోల్కొండపై జెండా
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ముందుకురాని పక్షంలో గోల్కొండ కోట సహా జాతీయ పతాకాలను ఎగురవేయాలని నిర్ణయించింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ డిమాండ్‌పై ముఖ్యమంత్రితో చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా లభించని నేపథ్యంలో సోమవారం మరోసారి అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు. అలాగే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ సోమవారం తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే.. జాతీయ పతాకాలను ఎగురవేయాలని తీర్మానించారు.
బతుకమ్మ ఉత్సవాలకు రూ. 10 కోట్లేనా?
బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నిధులకే పరిమితం కాకుండా పల్లెపల్లెలో ఘనంగా ఏర్పాట్లు ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డిపాల్గొన్నారు.