చేవెళ్లః పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగామాట్లాడుతూ పథకం డిజైన్ మార్చి, పరిధిని కుదించినట్లు వస్తున్న కథనాలలో వాస్తవం లేదన్నారు. మొదటి దశ కింద తీసుకున్న పనులను గురించి మాత్రమే ప్రచారం జరుగుతున్నదని, వచ్చే జనవరి, ఫిబ్రవరిలోగా రెండవ దశ నివేదిక సిద్ధమైతేనే ఈ ఎత్తిపోతల పథకం పూర్తి స్వరూపస్వభావాలు బయటపడతాయని చెప్పారు. ఈ పనుల కోసం పూర్తిస్థాయి డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి అప్పగించగా నివేదికను సమగ్రంగా అందించడానికి రెండు మూడు నెలల సమయం కావాలని కోరారని చెప్పారు.
ఈ ఎత్తిపోతల పథకం జూరాల నుంచి ప్రారంభమై కోలికొండ, గండీడు, లక్ష్మీదేవిపల్లి వరకు నాలుగు లిఫ్ట్‌లుగా ఉంటుందని గతంలో కేసీఆరే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 3లక్షల ఎకరాలతో పాటుగా నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నారని చెప్పారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాకుగా చూపి ఆయకట్టును లక్షా 30వేల ఎకరాలకు కుదింపు చేస్తున్నారని వస్తున్న కథనాలు వాస్తవం కాదన్నారు. అంతేకాకుండా చేవెళ్ల, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలను తొలగిస్తూ డిజైన్ చేశారనే వార్తలు కూడా సత్యదూరమని పేర్కొన్నారు.
‘ప్రాణహిత-చేవెళ’్ల అసాధ్యం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 11 లిఫ్ట్‌లను పూర్తిచేసి వాటిద్వారా నీటిని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. నిజంగానే ఆ ప్రాజెక్టు సాధ్యమైనా ఒక పంటకు నీళ్లివ్వడానికి విద్యుత్‌కు ఎకరాకు లక్షా 60వేల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకు రావాలనుకుంటే హైదరాబాద్‌కు వాడే విద్యుత్ మొత్తాన్ని ఈ ప్రాజెక్టు నీటి సరఫరాకే వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకులు రౌతు కనకయ్య, కొండా రాందేవ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భీమేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కన్వీనర్ చింపుల సత్యనారాయణరెడ్డి, నాయకులు ఆంజనేయులు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంచంద్రయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘పాలమూరు’ డిజైన్ మార్పు అవాస్తవం
Published Sun, Nov 16 2014 12:33 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement