‘ఆది’బట్లలో అంకురార్పణ | The first in in the state industry to appear in Telangana adibatla | Sakshi
Sakshi News home page

‘ఆది’బట్లలో అంకురార్పణ

Published Mon, Jun 23 2014 11:11 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

‘ఆది’బట్లలో అంకురార్పణ - Sakshi

‘ఆది’బట్లలో అంకురార్పణ

తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ స్థాపన ఇక్కడే
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సెజ్‌లో విమానాల తయారీ కంపెనీ
రూ.500 కోట్ల పెట్టుబడితో జర్మనీ కంపెనీతో టాటా భారీ ఒప్పందం
చిగురిస్తున్న రియల్ ఆశలు

 
ఇబ్రహీంపట్నం రూరల్:
తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ ఆదిబట్లలోనే రూపుదిద్దుకోనుంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ‘టాటా’ కంపెనీ ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టాటా లాకిడ్ మార్టిన్, టాటా ‘తారా’ వంటి హెలికాప్టర్ పరికరాల తయారీ కంపెనీల సరసన మరో పరిశ్రమ ఏర్పాటుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ రూపకల్పన చేసింది. దేశంలోనే మొత్తం విమానాన్ని తయారుచేసే ప్రథమ పరిశ్రమకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు.

 ఆదిబట్లలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీనిలో డార్నియార్ విమానాలకు సంబంధించిన మొత్తం పరికరాలన్నీ తయారవుతాయి. రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనున్నారు. జర్మనీకి చెందిన రుయాగ్ (ఆర్‌యూఏజీ) సంస్థతో టాటా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుని దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండు దశల్లో విమాన విడిభాగాల పరికరాలు తయారు చేస్తారు. మొదటి దశలో ప్రధాన భాగాల్ని, క్యాబిన్‌ను, రెండో దశలో పూర్తి విమానానికి రూపకల్పనచేస్తారు. పూర్తిస్థాయి విమానాన్ని రూపొందించే సంస్థ ఒకే చోట ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. దీంతో పలు కంపెనీల ఆగమనంతో ఆదిబట్లకు డార్నియార్ విమానాల రూపంలో మరో పరిశ్రమ రావడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

 టాటా సెజ్..

పలు ఐటీ, ఐటీ ఆధారిత, విమాన భాగాల తయారీ వంటి ప్రక్రియల కోసం 2009లో ఏపీఐఐసీ టాటా కంపెనీకి సుమారు 250 ఎకరాల భూమిని అప్పగించింది. ఈ క్రమంలో ఈ సెజ్‌లో ఇప్పటికే పలు కంపెనీలొచ్చాయి. లాకిడ్ మార్టిన్, తారా, టీసీఎస్ వంటి కంపెనీలు టాటా ఆధ్వర్యంలో తమ నిర్మాణ, ఉత్పత్తి పనులకు కేంద్రంగా మారుతూ శరవేగంగా దూసుకెళ్తున్నాయి. గతంలో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం టాటా విమాన విడిభాగాల తయారీ కంపెనీలోని కొన్ని విభాగాల్ని ప్రారంభించారు. ప్రస్తుతం టాటా కంపెనీ జర్మనీ సంస్థతో ఏర్పరచుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం తాజా పరిశ్రమకు శ్రీకారం చుట్టింది.

నాడు కుగ్రామం.. నేడు స్పేస్ సిటీ..

 ఆదిబట్ల పేరు రోజురోజుకూ మార్మోగుతోంది. ఒక ప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిబట్ల నేడు స్పేస్‌సిటీగా రూపాంతరం చెందింది. పలు ఐటీ కంపెనీలకు కేంద్రస్థానంగా నిలిచింది.

కేంద్రప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్‌కు కూడా ఆదిబట్ల ప్రధాన కేంద్రంగా మారింది. పలు బహుళజాతి పరిశ్రమలకు ఆదిబట్ల కేంద్రస్థానమవుతోంది. ఆదిబట్ల అభివృద్ధి చెందడంపై స్థానికులు, వ్యాపారులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచస్థాయి పెట్టుబడులకు కేంద్రంగా మారిన ఆదిబట్లలో స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెడ్ కార్పెట్..

 తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందారు. పెట్టుబడులన్నీ వెనక్కిపోతాయని కొందరు దుష్ర్పచారం కూడా చేశారు. దీంతో కొంత కాలంగా తెలంగాణలో పెట్టుబడులేవీ జరగలేదు. తొలిసారిగా రూ.500 కోట్ల పెట్టుబడితో విదేశీ సంస్థ ఒప్పందంతో భారీస్థాయి విమానాల తయారీ కేంద్రం రావడంతో పరిశ్రమలకు ఢోకా లేదని స్పష్టమైంది. మరోవైపు పెట్టుబడులు పెట్టేవారు టాటాను స్ఫూర్తిగా తీసుకుని పరిశ్రమల పెట్టుబడుల కోసం క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ విమానాల పరికరాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పరిశ్రమల ఉనికి ఎలా ఉంటుందోనన్న సందేహాలు తొలిగాయి. తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెడతామని.. కో ఆపరేటివ్ విధానాన్ని ఏర్పాటుచేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో పరిశ్రమల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ పరిచినట్టయింది. మరోవైపు అందర్నీ తనవైపు ఆకర్షిస్తున్న ఆదిబట్లలో మరిన్ని బహుళజాతి కంపెనీలు వచ్చేందుకు ఆస్కారముంది.

పుంజుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం

 గతంలో వలెనే  ఆదిబట్లలోరియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోనుంది. తెలంగాణ ఏర్పాటైతే పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయని అపోహ ఉండటంతో ఇన్నాళ్లూ ఈ వ్యాపారంలో స్తబ్ధత నెలకొంది. టాటా వంటి ప్రముఖ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆదిబట్లను కేంద్రంగా ఎంచుకోవడంతో ఈ ప్రాంతంలో రియల్ జోరు మళ్లీ పుంజుకోనుందని అందరూ భావిస్తున్నారు. టాటా కంపెనీల ఆగమనంతో గతంలో ఈ ప్రాంతంలో ఎకరా రూ.2కోట్లపైపే పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థిరాస్తి రేట్లు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు, వ్యాపారులు భావిస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement