కరీంనగర్ సిటీ : రెగ్యులర్ విద్యార్థులకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో హాస్టళ్లలో నియమించాల్సిన ట్యూటర్ల జాడ జిల్లాలో లేకుండాపోయింది. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఏ హాస్టల్‌లో ట్యూటర్‌ను నియమించిన దాఖలాలు లేవు. జిల్లాలో 53 బీసీ, 93 ఎస్సీ, 22 ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు ఉంటున్నారు.
ఏడో తరగతి, పదో తరగతి విద్యార్థులకు సాధారణ బోధనతో పాటు అదనంగా నాణ్యతతోకూడిన ఉత్తమ బోధన అందించేందుకు ప్రభుత్వం ట్యూటర్ల వ్యవస్థ ప్రవేశపెట్టింది. ఈ రెండు తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేయడం, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో ట్యూటర్ల పాత్ర కీలకం. ట్యూటర్‌గా ఉండడానికి కనీస విద్యార్హత డిగ్రీ కాగా, బీఈడీ ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తారు. సబ్జెక్ట్‌కు ఒకరు చొప్పున మ్యాథ్స్, ఇంగ్లిష్, సైన్స్ సబ్జెక్ట్‌లకు ముగ్గురు ట్యూటర్లను ప్రతీ హాస్టల్‌కు నియమిస్తారు. హాస్టల్‌కు ముగ్గురు చొప్పున జిల్లా వ్యాప్తంగా 504 మంది ట్యూటర్లను నియమించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే వీరిని నియమించడం లేదా కొనసాగించడం చే యాలి. కానీ, ఇప్పటివరకు నియమించకపోవడంతో హాస్టల్ విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారు.
వేతనంతోనే సమస్య
హాస్టళ్లలో ట్యూటర్ల నియామకానికి వారి వేతనమే అడ్డుగా నిలుస్తోందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతీ రోజు సాయంత్రం గంట పాటు బోధన చేసే ఈ ట్యూటర్లకు ప్రభుత్వం నెలకు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో హాస్టళ్లలో బోధించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సంక్షేమాధికారులు వాపోతున్నారు. గ్రామాల్లో ట్యూటర్ల సమస్య లేకున్నా... పట్టణాల్లో మాత్రం ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు.
పైవేట్ విద్యాసంస్థలు కోకొల్లలుగా ఉన్న పట్టణాల్లో రూ.500 వేతనంతో ట్యూటర్లుగా హాస్టళ్లలో పనిచేయడానికి ఎవరూ ప్రాధాన్యతనివ్వడం లేదు. వేతనం పెంచితే ఎవరైనా ముందుకు వచ్చే అవకాశముందని వార్డెన్లంటున్నారు. మొత్తానికి విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ట్యూటర్ల ఊసే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, సంక్షేమశాఖ అధికారులు వెంటనే ట్యూటర్ల సమస్యకు పరిష్కారం చూపిస్తేనే హాస్టల్ విద్యార్థుల నూటికి నూరుశాతం ఫలితాల లక్ష్యం నెరవేరుతుంది.
ట్యూటర్లెక్కడ?
Published Sun, Jul 13 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement