‘కాస్మొటిక్’ వెతలు!
ఆదిలాబాద్‌రూరల్: అమ్మానాన్నలకు దూరంగా ఉండి.. చదువే లక్ష్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు. ప్రభుత్వం హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొనడం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా కాస్మొటిక్ చార్జీలు చెల్లించకపోవడంతో ఆయా వసతిగృహ విద్యార్థులు విద్యపై దృష్టి సారించలేకపోతున్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలేవి..!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా ఆచరణలో అవి కనిపించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆయా వసతిగృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురై చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఖర్చులకు సరిపడా చార్జీలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా వాటిని కొనుగోలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలు చదువుతోనే బాగుపడుతాయని భావించి ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ విద్యార్థుల ఖర్చులకు నెలనెలా డబ్బులు పంపించాల్సి వస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాస్మొటిక్ చార్జీలు ఇలా..
జిల్లాలో ఎస్సీ బాలుర 19 వసతి గృహాలు ఉండగా, ఇందులో 821 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బీసీ ప్రీమెట్రిక్ 9 వసతిగృహాలు ఉండగా 573 మంది చదువుతున్నారు. గిరిజన వసతి గృహాలు 38 ఉండగా ఇందులో 10,621 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురకు కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.62 చెల్లిస్తున్నారు. ఆయా వసతి గృహాల్లో చదువుతున్న బాలుర విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల కింద ప్రభుత్వం నెలకు రూ.62 అందజేస్తుంది. ఇందులో విద్యార్థి రూ.50 తో సబ్బులు, నూనెలు, టూత్‌పేస్ట్, పౌడర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు హెయిర్ కటింగ్‌కు రూ.12 చెల్లిస్తుంది. ఎస్సీ, బీసీ వసతిగృహాల కాస్మొటిక్ చార్జీలను నేరుగా విద్యార్థులకు అందజేస్తారు. కాగా ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులకు సంబంధించి కాస్మొటిక్ చార్జీలను టెండర్ ద్వారా అందజేస్తారు.
కటింగ్ చార్జీలకు సంబంధించిన సొమ్మును సంబంధిత వసతిగృహ ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలతో నాయీ బ్రాహ్మణులు హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా లేకపోవడం, బయట మార్కెట్లో హెయిర్ కటింగ్‌కు ఒక విద్యార్థికి రూ.40 నుంచి రూ.50 తీసుకుంటుండడంతో ఇవి ఎటూ సరిపోవడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆయా వసతి గృహ నిర్వాహకులకు తెలియజేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహ విద్యార్థులు ఒకరికొకరు క్షవరం (హెయిర్ కటింగ్) చేసుకోవడం సంచలనం కలిగించింది.
లోపిస్తున్న నాణ్యత..
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న కాస్మొటిక్లలో నాణ్యత లోపిస్తోందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టు దక్కించుకునే సమయంలో నాణ్యతగల వస్తువులను చూపించిన కాంట్రాక్టర్లు తీరా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాస్మొటిక్ కిట్ మాదిరిగా పంపిణీ చేయాలి..
వసతి గృహాల్లోని విద్యార్థులకు కేసీఆర్ కిట్ అందిస్తున్న విధంగానే బాలుర వసతిగృహ విద్యార్థులకు సైతం కిట్లాగా అందజేస్తే బాగుంటుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – శివకుమార్, హెచ్‌డబ్ల్యూవో, బీసీ హాస్టల్, ఆదిలాబాద్
చార్జీలు సరిపోవడంలేదు
ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న కాస్మొటిక్ చార్జీలు రూ.62 సరిపోవడంలేదు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలి. హెయిర్ కటింగ్ కోసం ప్రభుత్వం రూ.12 మాత్రమే చెల్లిస్తుంది. కటింగ్ కోసం బయట రూ.40 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా భారమవుతోంది. – సాయికృష్ణ, బీసీ హాస్టల్ విద్యార్థి, ఆదిలాబాద్
ప్రతిపాదనలు పంపించాం
ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం కాస్మొటిక్ చా ర్జీల కింద ఒక్కొక్కరికి నెలకు రూ.62 అందజేస్తున్నాం. ఇందులో హెయిర్ కటింగ్ కోసం రూ.12, మిగితా రూ.50తో సబ్బులు, పౌడర్, నూనె కొనుగోలు చేసేందుకు అం దిస్తుంది. విద్యార్థినులకు కాస్మొటిక్ కిట్లు అందజేస్తున్నట్లుగా బాలురకు కూడా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
– ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి