అడవి బాట వీడి..సర్కారు కొలువుకు
- 17 ఏళ్ల ఉద్యమ జీవితం
- లొంగుబాటు తర్వాత మళ్లీ చదువు
- ఇంజనీరింగ్ విద్య పూర్తికి ప్రత్యేక అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
- తోడ్పాటు అందించిన పోలీసు అధికారి కాళిదాసు
- ఎంటెక్ పూర్తి.. ఆ వెంటనే ఉద్యోగం
- ఇదీ.. గసికంటి రాజమౌళి ప్రస్థానం
- మీడియూకు పరిచయం చేసిన ఎస్పీ
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాఘవ... ఇప్పుడు ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు. 1990 నుంచి 2007 వరకు మాత్రం ఈ పేరు కొన్ని ప్రాంతాల్లో చాలా మందికి తెలిసి ఉండేది. నల్లమల, దండకారణ్యం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ పేరు తెలిసినవారు ఎక్కువగానే ఉండేవారు. ముఖ్యంగా పోలీసు శాఖ వారికి బాగా తెలిసిన పేరు ఇది. తెలంగాణ రాఘవ పేరుతో 17 ఏళ్లపాటు పీపుల్స్‌వార్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈ వ్యక్తి అసలు పేరు గసికంటి రాజమౌళి.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సొంత ఊరు. పేద కుటుంబంలో జన్మించిన రాజమౌళి కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు సంపాదించాడు. అయితే 1990లో ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరంలో ఉన్నప్పుడు ఉద్యమబాట పట్టాడు. పీపుల్స్‌వార్‌లో చేరి వికారాబాద్, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో కొరియర్‌గా, డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. పుపుల్స్‌వార్ అగ్రనేతలు పులి అంజన్న(సాగర్), అక్కిరాజు హరగోపాల్(ఆర్‌కె)లకు కొరియర్‌గా కూడా ఆయన పని చేశారు. టైగర్ ప్రాజెక్టు దళంలోనూ కొనసాగారు.
మహానంది, ఉరవకొండ దళాలకు డిప్యూటీ కమాండర్‌గా, ఉరవకొండ దళానికి కమాండర్‌గా పని చేశారు. 2004 నుంచి 2007 వరకు దండకారణ్యంలో మావోయిస్టు పత్రిక క్రాంతి కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత అనార్యోగం కారణంగా 2007లో ఏప్రిల్ 9న రాజమౌళి కరీంనగర్‌లో లొంగిపోయారు. ఉద్యమ పంథాలో అలవడిన పట్టుదలతో మళ్లీ చదువు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సును ఎనిమిదేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆయన విద్యలో 17 ఏళ్ల విరామం రావడంతో నిబంధనలు అంగీకరించ లేదు. దీంతో లొంగుబాటు సమయంలో తీవ్రవాద నియంత్రణ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న ఎల్.కాళిదాసు (ప్రస్తుతం వరంగల్ రూరల్ ఎస్పీ)తో రాజమౌళికి పరిచయం ఉండడంతో రాఘవ.. కాళిదాసును సంప్రదించారు. కాళిదాసు చొరవతో అదే ఏడాది ప్రభుత్వం ఆయనకు ఇంజనీరింగ్ విద్య పూర్తిచేయడానికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. రాజమౌళి ఉస్మానియాలో ఇంజనీరింగ్ ఫైనలియర్ పూర్తి చేశారు. ఆ వెంటనే గేట్ ఉత్తీర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంటెక్ పూర్తి చేశారు.
2008లో సాగు నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఏపీసీఎస్సీ నోటిఫికేషన్ రాగా.. పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యూరు. 2012లో రాజమౌళికి పోస్టింగ్ వచ్చింది. గసికంటి రాజమౌళి ప్రస్తుతం జనగామలో ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్నారు. గసికంటి రాజమౌళిని వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు, ఓఎస్డీ అంబర్‌కిశోర్‌ఝా బుధవారం మీడియాకు పరిచయం చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి జనగామకు వచ్చిన తన నేపథ్యంపై రాజమౌళి ఈ సందర్భంగా వివరించారు.
తన జీవితంలో మంచి ఉంటే ఎవరికైనా ఉపయోగపడాలని ఆకాంక్షతోనే మీడియా మందకు వచ్చినట్లు తెలిపారు. వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు ప్రోత్సాహంతోనే తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని రాజమౌళి చెప్పారు. కాళిదాసు తనకు అన్ని రకాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు. చాలా వ్యవస్థల మాదిరిగానే పీపుల్స్‌వార్‌లోనూ గసికంటి రాజమౌళి వివక్ష ఎదుర్కొన్నారని రూరల్ ఎస్పీ కాళిదాసు వివరించారు.