సమ్మక్క-సారలమ్మ తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో మేడారం మురిసిపోయింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి ఆదివారం సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ములుగు గట్టమ్మ, మేడారం వద్ద నార్లాపురం-ఊరట్టం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. నార్లాపురం-ఊరట్టం క్రాస్ మధ్య 5 కిలోమీటర్లు వెళ్లడానికి 30 నిమిషాలు పట్టింది.
ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వాహనాలను ఊరట్టం క్రాస్ వద్ద నిలిపివేశారు. హోల్డింగ్ పాయింట్ నుంచి భక్తులను స్థానిక ఆటోల ద్వారా ఆలయం వైపునకు అనుమతి ఇచ్చారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కొన్ని కనెక్షన్‌లు మాత్రమే ఇవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా సిద్ధం చేయకపోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో పనులు జరగుతున్నాయని శనివారం వరకు ఒకవైపు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బారికేడ్లను తొలగించారు.