
చెత్తకుప్పలో చిన్నారి
మూడో సంతానంగా ఆడపిల్లేనని..గొంతు నులిమి పడేసిన తండ్రి?
సంగారెడ్డి క్రైం/మున్సిపాలిటీ: మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని కన్న తండ్రే పసికందును మట్టుబెట్టపోయాడు. గొంతు నులిమాడు. చనిపోయిందని భావించి చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం చోటు చేసుకుంది. నంగునూరు మండలం వెంకటాపూర్‌కు చెందిన నర్సింలు, స్వప్న భార్యాభర్తలు. మూడేళ్లుగా వీరు సంగారెడ్డిలోని సైనిక్‌నగర్ కాలనీలో నివాసముంటున్నారు. నర్సింలు పటాన్‌చెరు మండలం రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో పర్మనెంట్ కార్మికుడు. వీరికి సంజన, మానస ఇద్దరు కుమార్తెలు. అయితే నర్సింలు భార్య స్వప్న పట్టణంలోని గోకుల్ ఆస్పత్రిలో డిసెంబర్ 6న మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మూడో సంతానంగా మళ్లీ ఆడపిల్లేనా.. అని 17 రోజుల పసిపాపను చంపేందుకు కన్నతండ్రే గొంతు నులిమాడు. పాప చనిపోయిందని భావించి ప్రశాంత్‌నగర్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయ పరిసరాల్లోని చెత్తకుండీలో పడేశాడు.
కొద్ది సేపటికి చెత్తకుప్పలోంచి పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న పసిపాపను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ శ్రేయ ఆధ్వర్యంలో వైద్యులు చిన్నారికి చికిత్స నిర్వహించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. చిన్నారిని హత్య చేసేందుకు యత్నించిన తండ్రి నర్సింలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త అలాంటి వాడు కాదని భార్య స్వప్న చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది.