కీలక ఘట్టం.. ముందే సిద్ధం | The key highlight of the pre-prepared .. | Sakshi
Sakshi News home page

కీలక ఘట్టం.. ముందే సిద్ధం

Published Thu, Aug 28 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

కీలక ఘట్టం.. ముందే సిద్ధం

కీలక ఘట్టం.. ముందే సిద్ధం

  • గణేశ్ నిమజ్జనానికి ముందస్తు కసరత్తు   
  •  జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు
  • సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి ఉత్సవాల్లో కీలక  ఘట్టమైన నిమజ్జనం సందర్భంగా వాహనాలు సాఫీగా ముందుకు కదిలేందుకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన పనులకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. రహదారుల మరమ్మతులతో పాటు శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించింది. రాత్రి వేళ ఇబ్బందులు ఎదురవకుండా అవసరమైనన్ని వీధి దీపాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిమజ్జన యాత్ర ప్రారంభమయ్యే బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది.

    వివిధ మార్గాల నుంచి ట్యాంక్‌బండ్ వరకు, నిమజ్జన కార్యక్రమాలు జరిగే సరూర్ నగర్ చెరువు, సఫిల్‌గూడ చెరువు తదితర ప్రాంతాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. దాదాపు 228 కి.మీ.ల మేర ఈ ఏర్పాట్లు చేయనున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు, రహదారులు కుంగిపోయినా వెంటనే మరమ్మతులు చేసేందుకు తగిన మందీమార్బలం, యంత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచనున్నారు. ఈ పనులకు రూ.11.49 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు.  
     
    ఇవీ వివరాలు ...
    నిమజ్జన మార్గం: 227.85 కి.మీ.లు
         
    ఏర్పాట్లు చేసే జీహెచ్‌ఎంసీ విభాగాలు: శానిటేషన్, ఇంజినీరింగ్, విద్యుత్, జీవవైవిధ్య విభాగం.
         
    ప్రతి 3-4 కి.మీ.లకు ఒక గణేశ యాక్షన్ టీమ్(జీఏటీ) ఏర్పాటు.
         
    ఒక్కో జీఏటీలో ఒక శానిటరీ సూపర్‌వైజర్, ముగ్గురు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులు ఉంటారు.
         
    ఈ టీమ్‌లు రెండు షిఫ్టులుగా పనిచేస్తాయి.
         
    మొత్తం జీఏటీలు: 122
         
    శానిటరీ సూపర్‌వైజర్లు/శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు: 488 మంది
         
    మొత్తం కార్మికులు: 2826

     పనులు ఇలా...
    దాదాపు 320 ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలను తొలగించాల్సి ఉంటుందని అంచనా.
         
    ఇందుకుగాను జీహెచ్‌ఎంసీలోని 18 సర్కిళ్లకు కనీసం ఒక్కో  జేసీబీ, ఆరుటన్నుల వాహనాలు 4 వంతున అవసరం.
         
    జనసమ్మర్ధం అధికంగా ఉండే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, చార్మినార్ తదితర ప్రదేశాల్లో 19 మొబైల్ టాయ్‌లెట్ల ఏర్పాటు.
         
    నిమజ్జన యాత్ర సాఫీగా సాగేందుకు రహదారుల మరమ్మతులు, పాట్‌హోల్స్ పూడ్చివేత, కెర్బ్ పెయింటింగ్‌లు, లేన్ మార్కింగ్‌లు.
         
    ఎంపిక చేసిన 103 మార్గాల్లో ఈ పనుల కోసం రూ. 10.31 కోట్లు కేటాయించారు.
         
    పనులు చేయాల్సిన ప్రధాన మార్గాలు: బాలాపూర్-ట్యాంక్‌బండ్, ఎస్సార్‌నగర్, పంజగుట్ట, అమీర్‌పేట, తిరుమలగిరి, రాణిగంజ్, వారాసిగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, క్లాక్‌టవర్, ప్యారడైజ్, ప్రధాన రహదారిని కలిపే అంతర్గత రహదారుల్లోనూ పనులు చేయాల్సి ఉంది.
         
    అత్యవసరంగా రోడ్ల మరమ్మతులు చేసేందుకు.. వర్షం వచ్చి దెబ్బతిన్నా వెంటనే పూర్తి చేసేందుకు వెట్‌మిక్స్, పాట్‌హోల్ రిపేర్‌మెషిన్, షెల్‌మాక్‌లు కలిగిన వాహనాలతో ప్రత్యేక ఏర్పాట్లు. ఎప్పటికప్పుడు పనుల నిర్వహణకు ఒక్కో ఇంజినీరింగ్ డివిజన్‌కు 24 బృందాల నియామకం. ప్రతి బృందంలో ఏఈ, ఇతర సిబ్బంది, కార్మికులు ఉంటారు. రెండు షిఫ్టుల్లో పనులు చేస్తారు.
     
    విద్యుత్ ఏర్పాట్లు
    నిమజ్జన మార్గం పొడవునా విద్యుత్ దీపాలు వెలిగేలా చూస్తారు. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు. విద్యుత్ స్తంభాలకు రంగులు వేయడం వంటిపనులు చేస్తారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ఒక్కో షిఫ్టులో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లను అందుబాటులో ఉంచుతున్నారు.
         
    యాత్ర మార్గంలో చెట్టుకొమ్మల నరికివేతకు సర్కిల్ కు ఒక జీవవైవిధ్య విభాగ టీమ్‌ను నియమిస్తారు. రెండుషిఫ్టులుగా ఈటీమ్‌లు పనిచేస్తాయి.
         
    సున్నిత ప్రాంతాల్లో అత్యవసరంగా పని చేసేందుకు 18 ప్రత్యేక బృందాలను నియమించారు. అవసరమైన సామగ్రితో ఈ టీమ్‌లు 24 గంటలూ సిద్ధంగా ఉంటాయి.
     
     పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

     సాక్షి, హైదరాబాద్:
     వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి బేసిన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ, రవాణా శాఖల నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గకుండా ఓ అధికారి, డెరైక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ నుంచి జాయింట్ డెరైక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement