- మూతబడే దిశగా ఎస్పీఎం
- దయనీయ స్థితిలో ఎస్పీఎం కార్మికులు
- మూగబోనున్న కాగజ్‌నగరం
- తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు
కాగజ్‌నగర్ టౌన్ : పేపర్ ఫ్యాక్టరీనే నమ్ముకుని జీవిస్తున్న ఆ కార్మికుల పరిస్థితి పేపర్ ముక్కలాగే కానుందా..? కాగజ్‌నగర్‌లోని పేపర్ మిల్లు నడిపించడం కష్టమేనా..? మరి దానిపైనే ఆధారపడ్డ కార్మిక కుటుంబాల పరిస్థితి ఏంటీ..? కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వమే ఆదుకుంటుందనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆ కార్మికులకు భరోసా కల్పించే వారెవరు..? పాలకులూ స్పందించండి మీరే..!
కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) నిజాం నవాబు కాలంలో 1936 లో ఏర్పాటైంది. 1942లో ఈ ఫ్యాక్టరీలో పే పర్ ఉత్పత్తి ప్రారంభమైంది. దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వస్తున్న ఈ పేపర్ మిల్లు 2010 నుంచి నష్టాల బారిన పడింది. అప్పటి నుంచి యాజమాన్యం ప్ర క్షాళన మొదలుపెట్టింది. ఈ మిల్లుపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి బతుకుబండి లాగిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం మిల్లులో పేపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆ కార్మికుల కుటుంబాలు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 రోజులుగా మిల్లులో పేపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు నెలలుగా మిల్లులోని యంత్రాలు మూగబోయాయి.
తక్కువగానే వేతనాలు..
యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయడానికి గల కారణాలను, తాజా పరిణామాలపై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయకపోవడంతో కార్మికుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. మిల్లు ఉన్నతాధికారులు కూ డా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి వెళ్తున్నట్లుగా సమాచారం. మిల్లు నిర్వహణ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కూ డా సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. అసలే చాలీచాలని జీతాలు, ఆపై పెరుగుపోతున్న నిత్యావసర సరకుల ధరలు కార్మిక లోకానికి పెద్ద కష్టాలు తెచ్చిపెట్టగా, మరో వైపు తాజా గా మిల్లు మూతబడే స్థాయికి చేరడంతో ఏం చేయాలో కార్మికులకు తోచడం లేదు. ఇతర కాగిత పరిశ్రమలతో పోలిస్తే, స్థానిక మిల్లులో అతి తక్కువ వేతనాలతోనే కార్మికులు సేవలందించారు. ఆశించిన స్థాయిలో పేపర్ ఉత్పత్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అయినా యాజమాన్యం ఉత్పత్తిని ఎందుకు నిలిపివేసిందో అనే అంశంపై జవాబు లేకుండాపోయింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఉత్పత్తిని నిలిపివేసిన యాజమాన్యం కార్మికులకు 2 నెలల జీతాలు చెల్లించి, నవంబర్ నెల వేతనాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు.
నిర్మానుష్యంగా మిల్లు..
ఎప్పటికీ కార్మికులతో కళకళలాడే మిల్లు లోపలి భాగం ప్రస్తుతం వెలవెలబోతోంది. యంత్రాలు మూగబోయాయి. ప్రతి రోజూ వందలాది సంఖ్యలో కర్ర, ఇతర ముడిసరుకులు తీసుకొచ్చే వాహనాలు పత్తా లేకుండాపోయాయి. మిల్లు ప్రాంతంలోని చిన్నచిన్న వ్యాపారులకూ ఉపాధి లేకుండాపోయింది. 1600 మంది కాంట్రాక్టు కార్మికులు మంచిర్యాల, కరీంనగర్, బల్లార్షా, చంద్రాపూర్ వంటి నగరాలకు వెళ్లి కూలీనాలీ చేసుకుంటున్నారు. కాగా, మిల్లును ఎలాగైనా తెరిపించాలనే సంకల్పంతో కార్మిక సంఘాల నాయకులు ఏకతాటిపైకొచ్చి ఉద్యమ బాట పట్టారు.
ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి మిల్లు ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలను తలపిస్తూ, కార్మికులతోపాటు అన్ని సంఘాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారులు, వైద్యులు ఇలా ప్రతి ఒక్కరూ ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు.
కొత్త ప్రభుత్వంపైనే ఆశలు..
కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుపైనే ఇక్కడి వాసులు ఆశుల పెట్టుకున్నారు. డిసెంబర్ 25న సీఎం జైపూర్ పర్యటనకు వచ్చినా మిల్లుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. స్థానిక పాలకులు స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మిల్లు నడిపించేలా బాధ్యత తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.