‘కు.ని.’లో ఇంత నిర్లక్ష్యమా..?
బిచ్కుంద : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరంలో వైద్యుల స్పందన కరువైంది. ఆపరేషన్ చేయించుకుంటామని పలువురు బాలింతలు ముందుకు వచ్చినా.. శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. బిచ్కుందలో బుధవారం నిర్వహించిన క్యాంపునకు సుమారు 200 మంది మహిళలు ఆపరేషన్ కోసం తరలివచ్చారు.వైద్యులు 60 మందికే ఆపరేషన్ చేస్తామని టోకెన్లు ఇచ్చారు.
మిగత వారికి చేయమని చెప్పడంతో మహిళలు, వారి కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ కోసం మూడు నెలలుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నామని, ఏఎన్‌ఎంలు, వైద్యులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం...
ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మహిళలకు ప్రోత్సాహకంగా వెయ్యి రుపాయలు నగదు అందిస్తోంది. వారికి కు.ని.పై అవగాహన కల్పించేందుకు లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది. అరుుతే ఇక్కడ మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినా వైద్యులు ససేమిరా అనడం గమనార్హం. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాలకు కలిపి నెలలో ఒకేసారి క్యాంపు నిర్వహిస్తున్నారు.
ప్రతీ నెల సుమారు 100 నుంచి 150 మంది మంది మహిళలు వస్తున్నా వైద్యులు మాత్రం నెలలో 60 మందికే ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు. మారుమూల గ్రామాలైన జుక్కల్, మద్నూర్ మండలాల మహిళలు సౌకర్యాలు లేకపోవడంతో బాన్సువాడ ఆస్పత్రికి వెళ్లలేక పోతున్నారు. అరుుతే నెలలో రెండు క్యాంపులు నిర్వహించాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.