దిక్కరించి ఓటేస్తే.. సీటు గోవిందా! | The situation defiance of the whip as zptc | Sakshi
Sakshi News home page

దిక్కరించి ఓటేస్తే.. సీటు గోవిందా!

Published Sun, May 25 2014 2:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దిక్కరించి ఓటేస్తే.. సీటు గోవిందా! - Sakshi

దిక్కరించి ఓటేస్తే.. సీటు గోవిందా!

విప్ ధిక్కరిస్తే జెడ్పీటీసీల పరిస్థితి అంతే

అయినా గులాబీవైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్, టీడీపీ సభ్యులు
టీఆర్‌ఎస్ తరపున పోటీచేస్తే మళ్లీ గెలుస్తామనే ధీమా

 
హైదరాబాద్ : సార్వత్రికఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. ఏ పార్టీకీ మెజారిటీ సీట్లురాని జిల్లాల్లో సొంత జెడ్పీటీసీలను కాపాడుకోవడం ఆ పార్టీలకు తలకు మించిన భారమైంది. జెడ్పీఛైర్మన్ ఎన్నికల్లో విప్ జారీ చేస్తామని ఆ పార్టీలు హెచ్చరించినా బెదిరే నాథుడే లేడు. విప్ ధిక్కరిస్తే జెడ్పీటీసీ పదవి పోతుందని తెలిసినా వారు అందుకు సిద్ధమవుతున్నారు. సీటు పోయినా సరే ఓటు చెల్లుతుందనే ధీమాతో విప్ ధిక్కరణకు రెడీ అవుతున్నారు. అధికారపార్టీ అందించే తాయిలాలు, భవిష్యత్ అవసరాలు, సొంతపనులు చక్కదిద్దుకోవచ్చనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నారు.  మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. జెడ్‌పీ ైచైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకముందే ఆయా జిల్లాల్లో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. మెదక్ జిల్లాల్లో ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని గులాబీ కండువా వేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో ఫిరాయింపులు ఎక్కువయ్యే పరిస్థితి కనిపించడంతో ఏకంగా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చి ప్రతిఫలంగా జిల్లా వైస్‌ైచైర్మన్ పదవి పొందాలని టీడీపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. జెడ్‌పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తుండగా, కాంగ్రెస్‌ను చీల్చి లబ్ధిపొందాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది. జెడ్పీ పీఠం ఏ పార్టీ దక్కించుకోవాలనుకున్నా నర్సంపేట స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మద్దతు అత్యవసరం. ఆయన మద్దతుకోసం రెండుపార్టీలు బేరసారాలకు సిద్ధమవుతున్నాయి.

మెదక్ జెడ్‌పీ పీఠం టీఆర్‌ఎస్‌దే

మెదక్ జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకుగాను, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరో 21 స్థానాలు, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి 24 స్థానాలు అవసరం. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో గులాబీ పార్టీ బలం 26కి చేరింది. అంటే జెడ్పీ పదవికి అవసరమైన సీట్లకంటే మరో రెండు అధికంగా ఆ పార్టీకి లభించాయి. దీంతో జెడ్పీ పీఠం టీఆర్‌ఎస్‌కు ఖాయమైనట్టే. అంతేకాక కాంగ్రెస్‌కు చెందిన మరో నలుగురు జెడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.

వరంగల్‌లో దొంతి పాత్ర కీలకం

ఈ జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో కాంగ్రెస్‌కు 24, టీఆర్‌ఎస్‌కు 18, టీడీపీకి 6 గురు జెడ్పీటీసీలుండగా, బీజేపీకి ఒకరు, స్వతంత్రంగా ఎన్నికైన మరో జెడ్పీటీసీ ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే 26 స్థానాలు అవసరం. కాంగ్రెస్‌కు మరో ఇద్దరు జెడ్పీటీసీలు మద్దతిస్తే ఆ పార్టీకి పీఠం దక్కుతుంది. ఇక్కడ ఏ పార్టీకి జెడ్పీ పదవి దక్కాలన్నా స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన దొంతి మాధవరెడ్డి కీలకం. ఎందుకంటే ఈ జిల్లాలో 8 మంది జెడ్పీటీసీలు దొంతి వెన్నంటి ఉన్నారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీకి చెందిన వారు. దీంతో దొంతిని తమవైపు రప్పించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు తీవ్రయత్నాలు చేస్తున్నారు. దొంతి మాత్రం మూడు షరతులు పెట్టి కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపుతున్నారు. తనపై పార్టీ విధించిన బహిష్కరణను ఉపసంహరించుకోవడం, డీసీసీ పగ్గాలు తిరిగి తనకు అప్పగించడమేగాక,తాను సూచించిన వ్యక్తినే జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌పార్టీ మాత్రం దొంతి షరతులకు తలొగ్గే పరిస్థితి కనిపించడం లేదు. తన ప్రతిపాదనకు ఏ పార్టీ ఓకే చెబితే ఆ పార్టీకే మద్దతిస్తానని దొంతి మాధవరెడ్డి చెబుతున్నారు. జిల్లాలోని నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బి.కవితను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవాలన్న దొంతిప్రతిపాదనకు ఏ పార్టీ మొగ్గు చూపుతుందనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

వైస్-చైర్మన్ పదవిస్తే టీఆర్‌ఎస్‌కు జైకొడతామంటున్న పాలమూరు తమ్ముళ్లు

మహబూబ్‌నగర్ జిల్లాలో 64 జెడ్పీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్‌కు 28, టీఆర్‌ఎస్‌కు 25 సీట్లున్నాయి. అదే  సమయంలో టీడీపీకి 9, బీజేపీకి ఇద్దరు జెడ్పీటీసీలున్నారు. జెడ్పీ పదవి ఏపార్టీకి దక్కాలన్నా 33 మంది జెడ్పీటీసీల మద్దతు అవసరం. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ఇతర పార్టీల మద్దతుకోసం యత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ పెద్దలు మాత్రం టీడీపీ, బీజేపీతోపాటు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు కూడా లాగేందుకు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు ఇటు కాంగ్రెస్, అటు టీడీపీకి చెందిన కొందరు జెడ్పీటీసీలు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. కాగా, జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ పదవిని తమకు కేటాయిస్తే, మద్దతిస్తామని  టీడీపీ జిల్లా నేతలు టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై టీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిసింది. కాంగ్రెస్‌కు జెడ్పీటీసీలు కొందరు ఇప్పటికే తమతో టచ్‌లో ఉండడంతో టీడీపీకి వైస్‌చైర్మన్ పదవి ఇవ్వాలా, వద్దా? అనే విషయాన్ని గులాబీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరోవైపు జెడ్పీపదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే  వంశీకృష్ణ సతీమణి అనురాధను జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో దింపేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ జెడ్పీటీసీలతో మంతనాలు జరపడంతోపాటు అనేక తాయిలాలను వారికి ఎర చూపుతున్నట్టు తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement