కేసీఆర్‌ కిట్‌లో సిరిసిల్ల చీర! | The State Government has come up with “Amma Vodi” scheme | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కిట్‌లో సిరిసిల్ల చీర!

Published Tue, Apr 11 2017 3:13 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

కేసీఆర్‌ కిట్‌లో సిరిసిల్ల చీర! - Sakshi

కేసీఆర్‌ కిట్‌లో సిరిసిల్ల చీర!

► ఇటు తల్లీబిడ్డల సంక్షేమం..అటు నేత కార్మికులకు ప్రయోజనం
► ఆరు లక్షల చీరల తయారీకి ఒప్పందం...
► రూ.12 కోట్ల కాంట్రాక్టు అప్పగించిన టెస్కో
► 54 సొసైటీల్లోని 6 వేల మందికి ఏడాదంతా ఉపాధి  


సాక్షి, సిరిసిల్ల: అమ్మ ఒడి పథకంలో భాగంగా తల్లి, బిడ్డల సంరక్షణ కోసం అందజేయనున్న ‘కేసీఆర్‌ కిట్‌’లో సిరిసిల్ల నేత చీర చేరింది. ప్రసూతి మరణాలు, శిశు మరణాల నియంత్ర ణ కోసం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు తల్లిబిడ్డల సంరక్షణకు అవసరమైన వస్తువులతో కూడిన ‘కేసీఆర్‌ కిట్‌’ను అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కిట్‌లలో ఉంచే వస్తువులను సీఎం కేసీఆర్‌ ఇటీవలే స్వయంగా పరిశీలించారు కూడా. ఆ వస్తువుల జాబితాలో చీర కూడా ఉంది. ఈ చీరల తయారీ కాంట్రాక్టును సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగిస్తూ ‘టెస్కో (తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ)’సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

రూ.12 కోట్ల ఆర్డర్‌
నేత కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ కొంత కాలంగా చొరవ చూపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్‌వీఎం ద్వారా పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫారం వస్త్రాల తయారీని సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించింది. తాజాగా కేసీఆర్‌ కిట్లలో ఇచ్చే షిఫాన్‌ చీరల తయారీ కాంట్రాక్టు కూడా సిరిసిల్ల నేత కార్మికులకు దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు అవసరమైన 6 లక్షల చీరలను (విత్‌ బ్లౌజ్‌) అందజేయాలని టెస్కోను వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ కోరారు. టెస్కో ఈ కాంట్రాక్టును సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని 54 మ్యాక్స్‌ సొసైటీలకు ఈ 6 లక్షల చీరల (సుమారు 40 లక్షల మీటర్ల వస్త్రం) తయారీని విడతల వారీగా అప్పగించేందుకు చేనేత, జౌళి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలకు 50 వేల చీరల చొప్పున ఏడాది పొడవునా తయారీ కొనసాగనుంది. 54 మ్యాక్స్‌ సొసైటీల్లోని దాదాపు ఆరు వేల మందికి ఉపాధి దొరకనుంది. మొదటి విడతలో మే నాటికి 50 వేల చీరలను అందజేసేలా సొసైటీలతో అధికారులు సోమవారం ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మేర ఐదు రంగుల్లో చీరలు తయారు చేయనున్నారు. సిరిసిల్లలో చీరలను తయారు చేశాక వాటిపై హైదరాబాద్‌లో డిజైన్లను ముద్రించనున్నారు.

ఉపాధి అందేనా?
నేత కార్మికుల ఉపాధి కోసం ప్రభు త్వం రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగిస్తున్నా.. లక్ష్యం అనుకున్నంతగా నెరవేరడం లేదు. పెట్టుబడి పెట్టేందుకు ఆసాములకు ఆర్థిక స్థోమత లేకపోవడం, కార్మికులకు కూలి గిట్టుబాటు కాకపోవ డమే ఇందుకు కారణం. దాంతో సిరిసిల్ల లో నేత కార్మికులు, ఆసాముల జీవన స్థితి గతుల్లో మార్పురావడం లేదు.

పైగా అప్పుల కారణంగా ఆత్మహత్యలు పెరిగి పోయాయి. తాజాగా ప్రభుత్వం అప్పగిం చిన చీరల తయారీ పనికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల ద్వారా రుణంగా అందజేయాలని, కార్మికులకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నెలసరి కూలి గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement