‘ఫాస్ట్’..స్లో | the students face problems with the scheme | Sakshi
Sakshi News home page

‘ఫాస్ట్’..స్లో

Published Fri, Oct 17 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

‘ఫాస్ట్’..స్లో

‘ఫాస్ట్’..స్లో

ఖమ్మం హవేలి: ఫీజుల చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకం అమలు కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజుల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని వేసింది. ఈ కమిటీ నిర్ణయం కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్గదర్శకాలు వస్తేనే ఈ విద్యా సంవత్సరం ఫీజులు మంజూరయ్యే అవకాశం ఉంది. పైగా గత విద్యా సంవత్సరం ఫీజులు కూడా పెండింగ్ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
 
యుటిలైజేషన్ సర్టిఫికెట్ల సమర్పణలో నిర్లక్ష్యం
జిల్లాలోని 410 కళాశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆన్‌లైన్ ద్వారా కూడా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినా పెద్దగా స్పందనలేదు. కళాశాలలు ఆన్‌లైన్‌లో డేటా ఇచ్చి అందుకు సంబంధించిన కాపీలు తీయాలి. ప్రిన్సిపాల్ సంతకం పెట్టించి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు వీటిని అందజేయాలి. కానీ జిల్లాలో ఉన్న పలు కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉండటం గమనార్హం.
 
సర్టిఫికెట్ల జారీలో వివిధ శాఖల జాప్యం
2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.277కోట్ల ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. దీనిలో రూ.212 కోట్లకు మాత్రమే కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చాయి. మరో రూ.65 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు బీసీ సంక్షేమశాఖకు అందాల్సి ఉంది.   

 మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా విద్యార్థులకు రూ.6 కోట్ల వరకు ఫీజులు వచ్చాయి. ఇందులో రూ.1.2 కోట్లకు మాత్రమే కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.220 కోట్ల ఫీజులు వచ్చా యి. రూ.40కోట్లకు కళాశాలల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఈ శాఖకు అందాల్సి ఉంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు నిర్లక్ష్యం వీడితే గత విద్యాసంవత్సరం పెండింగ్‌లో ఉన్న ఫీజులు ప్రభుత్వం నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

గత విద్యాసంవత్సరం ఎస్సీ విద్యార్థులకు రూ.36 కోట్లకు గాను రూ.26 కోట్లు రాగా మరో రూ.10 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.1.33కోట్లకు రూ.1.13కోట్లు వచ్చాయి. ఇంకా రూ.20 లక్షలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.17 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. గత విద్యా సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయడంతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకం అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల పాట్లు..
ఫాస్ట్ పథకానికి రేషన్‌కార్డుతో లింక్ తొలగించి విద్యార్థులకు కొత్తగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ధ్రువపత్రాల కోసం విద్యార్థులు అనేక పాట్లు పడుతున్నారు. పాత ధ్రువీకరణపత్రాల స్థానంలో కొత్త పత్రాలు పొందాలని సూచించడంతో విద్యార్థులు తరగతులు మానుకొని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ధ్రువీకరణ పత్రాల జారీలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయినా ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జాప్యమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement