కోదాడటౌన్: ఉపకార వేతనాల కోసం విద్యార్థులు ఉద్యమ బాట పడుతున్నారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ‘ఫాస్ట్’ పథకం గైడ్‌లైన్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇటు విద్యార్థుల్లో, అటు ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకుల్లో అలజడి మొదలైంది. ఈ నెల 7వ తేదీతో డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా జిల్లాలోని మహాత్మాగాంధీ వర్శిటీ ప్రకటించింది.
ఇప్పటి వరకు ఉపకార వేతనాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయనందున విద్యార్థులు కళాశాల ఫీజులను చెల్లిస్తేనే పరీక్ష ఫీజును తీసుకుంటామని చెపుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 40 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఇప్పటి వరకు ఎదురుచూస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. రోజు వా రి నిర్వహణ ఖర్చులు కూడా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నెలల తరబడి అధ్యాపకులకు జీతాలు ఇవ్వకపోవడంతో పాఠాలు చెప్పడానికి వారు ముందుకు రావడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి.
తీవ్రమవుతున్న సమస్య
జిల్లాలో వివిధ కోర్సులు చదువుతూ గత సంవత్సరం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకున్న 90, 413 మందితో పాటు ఈ విద్యాసంవత్సరం మరో 50 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 41 ఇంజనీరింగ్, 116 డిగ్రీ, 242 జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు డిప్లోమా, బీఫార్మసీ, ఐటీఐ, నర్సింగ్, డీఎడ్, బీఈడీ, పీజీ కోర్సులు చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో 90 శాతానికి పైగా కళాశాలలు ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో పలు కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే విధంగా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలతోనే చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు దాదాపు 90 శాతానికి పైగా ఉన్నారు.
కాలేజీకి రావడం మానేస్తున్న విద్యార్థులు
ప్రభుత్వం ఉపకార వేతనాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాలలు ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తుండడంతో ఇపుడు వీరంతా కళాశాలలకు రావడం మానేస్తున్నారు. గతంలో విద్యార్ధులకు వచ్చే ఉపకార వేతనాలను కళాశాల ఫీజు కింద తీసుకొని తరగతులకు అనుమతించే వారు. కొన్ని కళాశాల లు పరీక్ష ఫీజు కూడా వారే చెల్లించేవారు.
ప్రస్తుతం ఉపకార వేతనాలు రావపోవడంతో కళాశాల ఫీజు, పరీక్ష ఫీజు కలిపి దాదాపు 7 నుంచి 10 వేల రూపాయలు వరకు చెల్లించాల్సి వస్తుంది. కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో విద్యార్థులు కళాశాలలకు రావడమే మానేస్తున్నారు. 7వ తే దీ వరకు మాత్రమే సమయం ఉండడంతో డిగ్రీ విద్యార్థు లు ఉద్యమబాట పడుతున్నారు. వీరికి ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా తోడు కావడంతో ఈ సమస్య రానున్నరోజుల్లో తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాలేజీలు మూసివేయడమే మిగిలింది : పి. నాగిరెడ్డి, సాయివికాస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, కోదాడ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలను ఇవ్వకపోవడంతో కళాశాలలను నడపలేకపోతున్నాం. కళాశాలల నిర్వాహకులు భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, అధ్యాపకుల జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఉపకార వేతనాలు విడుదల చేయాలి. లేని పక్షంలో కళాశాలలను మూసి వేయడమే శరణ్యం.
‘ఉపకారం’ కోసం ఉద్యమం
Published Sat, Jan 3 2015 4:29 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement