సమన్యాయంపైనే మానవజాతి మనుగడ
దోమలగూడ, న్యూస్‌లైన్: సమాజంలో అసమానతలు పోవడానికి స్ఫూర్తి కాళోజీ రచనలేనని, వాటిని ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి అన్నారు. దోమలగూడలోని హైదరాబాదు స్టడీసర్కిల్ ఆడిటోరియంలో కాళోజీ శత జయంత్యుత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. కాళోజీ ఉత్సవ్ సమాచార పత్రిక మొదటి, రెండవ సంచికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమన్యాయం పైనే మానవ జాతి మనుగడ ఆధారపడి ఉందన్నారు. సమన్యాయం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో రాసుకున్నా.. ఇంకా అసమానతలే కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు, అర్బన్‌ల్యాండ్ సీలింగ్ అమలులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సేద్యం చేసుకోవడానికి ఎకరం భూమి, ఇల్లు కట్టుకోవడానికి వంద గజాల స్థలం లేని ఎంతోమంది పేదలు ఉన్నారని అన్నారు. చట్టాలు చేస్తున్నా వాటిలో లోపాలు, లొసుగులు, జాప్యాలతో న్యాయం జరగడం లేదని వాపోయారు.
జాతి సంపద దోపిడీకి గురవుతోందని, మానవ వనరులను కొద్దిమందే అనుభవిస్తున్నారన్నారు. కార్యక్రమానికి కాళోజీ శత జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ బి. న ర్సింగరావు అధ్యక్షత వహించగా.. ప్రొఫెసర్ కేశవ్‌రావ్ జాదవ్, ప్రముఖ కవి, విమర్శకులు డాక్టరు అంబటి సురే ంద్రబాబు, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధి టి. ప్రభాకర్, ‘కాళోజీ ఉత్సవ్’ పత్రిక సంపాదకులు వేణు సంకోజు, జలంధర్‌రెడ్డి, ఎ. వేణుగోపాల్ తదితరులు పాల్గొని మాట్లాడారు.