మే 9న రాష్ట్రంలో
లాంఛనంగా ప్రారంభం
ఒకే రోజు అటల్ పింఛన్..
జీవనజ్యోతి బీమా..
సురక్ష బీమాలకు శ్రీకారం
హైదరాబాద్: పేద, అసంఘటిత రం గంలో పని చేసే కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను రాష్ట్రంలో ఈనెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. అటల్ పింఛన్ యోజన, జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన.. ఈ మూడు పథకాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దీనికి ముందస్తు ఏర్పాట్లపై తెలంగాణ ఆర్థిక శాఖ రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించింది. బీమా పథకాల విధివిధానాలను చర్చించింది. సామాన్యులకు వీలుగా అతి తక్కువ ప్రీమియంతో ఉన్నందున ఈ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
అసంఘటిత రంగానికి అటల్ పింఛన్
అసంఘటిత కార్మికులు సైతం ఉద్యోగ విరమణ అనంతరం ఆనందంగా జీవించేందుకు పొదుపును ప్రోత్సహించేలా అటల్ పింఛను యోజన(ఏపీవై) విధివిధానాలు ప్రకటించింది. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని బ్యాంకుల ఖాతాదారులు ఇందుకు అర్హులే. ఈ పథకంలో చేరిన వారికి ప్రతీ నెలా కచ్చితంగా రూ.1,000 నుంచి రూ.5,000 పింఛను లభిస్తుంది.
జూన్ 1 నుంచి డిసెంబరు 31 మధ్య ఈ పథకంలో చేరే అర్హులైన లబ్ధిదారుడికి ప్రభుత్వం అయిదేళ్ల పాటు సహాయం అందిస్తుంది. 60 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత వంద శాతం ఫింఛన్ మొత్తాన్ని తీసుకొని ఏపీవై నుంచి తప్పుకునే వీలుంటుంది. వయస్సు.. ఆశించే నెలసరి పింఛను బట్టి నెలనెలా పొదుపు చేసే మొత్తం కూడా మారుతుంది. ఉదాహరణకు రూ.1,000 పింఛను ఆశిస్తున్న లబ్ధిదారుడి ప్రవేశ వయస్సు 18 ఏళ్లుంటే.. నెలకు రూ.42 పొదుపు చేయాలి. రూ.5,000 పింఛను ఆశిస్తే నెలకు రూ.210 చెల్లించాలి. వయస్సును బట్టి పొదుపు చేసే మొత్తం మారుతుంది.
మిగతా బీమా పథకాలతో పోలిస్తే అతి తక్కువ ప్రీమియం చెల్లించేలా దీనికి మార్గదర్శకాలు రూపొందించారు. ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18-50 ఏళ్ల వయస్సున్న వారందరూ ఇందులో చేరేందుకు అర్హులు. 55 ఏళ్ల వరకు ఈ బీమా ప్రయోజనాలుంటాయి. బీమా చేసిన వ్యక్తి 55 ఏళ్లలోపు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు.
‘సురక్ష యోజన’తో...
ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆదుకునేందుకు ఈ పథకాన్ని రూపొం దించారు. 18-70 ఏళ్ల వయస్సున్న అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఏడాదికి కేవలం రూ.12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదంలో మరణించినా.. వైకల్యం సంభవించినా రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు. పాక్షికంగా వైకల్యం సంభవిస్తే రూ.లక్ష పరిహారం చెల్లిస్తారు. ఈ పథకాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు తమ ఖాతాలున్న బ్యాంకుల్లో సమ్మతి పత్రం అందించి.. ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
బీమా...ఇక కార్మికులకు ధీమా
Published Sat, May 2 2015 3:40 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement