చేదు మిగిల్చిన ‘షుగర్స్’
♦ ఎన్డీఎస్‌ఎల్ కార్మికుల కన్నీటి వ్యథ
♦ ఆరునెలలుగా మూతపడ్డ ఫ్యాక్టరీ
♦ ఆకలితో అలమటిస్తున్న కార్మికులు
♦ గుండెపగిలి ఇద్దరి మృతి
♦ నేడు ‘మే డే’ సందర్భంగా ప్రత్యేక కథనం..
మెదక్/మెదక్ రూరల్: ప్రపంచ కార్మికులంతా ఆనందోత్సాహాల మధ్య మేడే జరుపుకొంటుంటే మెదక్ ఎన్డీఎస్‌ఎల్ కార్మికులు కన్నీళ్లను దిగమింగుకుంటూ బేల చూపులు చూస్తున్నారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామనే టీఆర్‌ఎస్ హామీ గాల్లో కలిసింది. ఆరునెలల క్రితం కుంటి సాకులతో ఎన్డీఎస్‌ఎల్ యా జమాన్యం అక్రమ లేఆఫ్ ప్రకటించి కార్మికులను రోడ్డున పడేసింది. దీంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంభోజిపల్లి శివారులో 30ఏళ్ల క్రితం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ప్రారంభంలో 500మంది పనిచేసేవారు. సీజన్‌లో వేల మంది పని చేస్తుంటారు. సీజన్‌లో ఫ్యాక్టరీలో 5 లక్షల టన్నుల చెరుకు గానుగాడించే వారు.
12 మండలాల రైతులకు, కార్మికులకు ఫ్యాక్టరీ కల్పతరువుగా నిలిచింది. అప్పటి సీఎం చంద్రబాబు హ యాంలో 51 శాతం వాటాను ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా తొలిసారిగా కార్మికుల పొట్టకొట్టారు. అప్పటి నుంచి రైతులకు దెబ్బపై దెబ్బ తగులుతూనే ఉన్నాయి. కొత్త యాజమాన్యం వచ్చీ రాగానే వందలాది మందికి బలవంతంగా వీఆర్‌ఎస్ ఇచ్చి ఇంటికి పంపింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వేతన సవరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు మూడుసార్లు వేతన సవరణ ఎగ్గొట్టింది.
అక్రమ లేఆఫ్‌తో కార్మికులు రోడ్డుపాలు
ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం ఫ్యాక్టరీకి అక్రమ లేఆఫ్ ప్రకటించి కార్మికులను రోడ్డున పడేసింది. కార్మికులకు చెల్లించాల్సిన వేతన సవరణను ఎన్నోసార్లు ఎగ్గొట్టింది. రిటైర్డ్ అయిన ఎందరో కార్మికులను ఒట్టి చేతులతో గెంటేసింది. దశాబ్దాల తరబడి తమ జీవితమంతా కండలు పిండిచేసుకొని ఫ్యాక్టరీలో పనిచేస్తే రిటైరయ్యే నాటికి పీఎఫ్ డబ్బులకూ నోచుకోక ఇటీవలే ఇద్దరు కార్మికులు గుండె ఆగి మరణించారు. పలు కార్మిక కుటుంబాలు పస్తులుంటున్నాయి. పూట గడవక కార్మికులు అడ్డాపై కూలీకి నిల్చుంటున్నారు. వేతనాలు, పీఎఫ్ డబ్బులు ఇవ్వాలంటూ ఎన్నోసార్లు ఆందోళనలు, ధర్నాలు చేసినా యాజమాన్యం స్పందించిన పాపాన పోలేదు.
టీఆర్‌ఎస్ హామీ నెరవేరేదెప్పుడు?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సమస్యలు పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని కార్మికులు అంటున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన వేతనాలను నెలనెలా ఇప్పించాలంటూ పాలకుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎంతమందికి విన్నవించినా ఫలితం కరువైంది. గత ఆరు నెలల్లో నలుగురు కార్మికులు పదవీ విరమణ పొందారు. వీరికి ఎలాంటి ప్రయోజనాలు అందలేదు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్మికులు శనివారం రిటైర్డ్ అయి కన్నీటి పర్యంతమవుతూ ఇళ్లకు వెళ్లారు.
రోడ్డుపైనే రిటైర్మెంట్లు..
అక్రమ లేఆఫ్‌తో యాజమాన్యం ఫ్యాక్టరీకి తాళం వేయగా, రిటైరైన కార్మికులను తోటి కార్మికులు చం దాలు వేసుకొని గేటుముందే సన్మానించుకోవాల్సిన దుస్థితి.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.