
సాక్షి, హైదరాబాద్: సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా 5 రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లను బంద్ చేస్తున్నట్టు దక్షిణాది సినీ నిర్మాతల మండలి ప్రకటించింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్‌వో సంస్థలు) వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తగ్గించాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జేఏసీ చైర్మన్ డి.సురేశ్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
‘‘డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు (క్యూబ్, యూ ఎఫ్‌వో సంస్థలు) ఏర్పాటు చేసిన కొన్నాళ్ల తర్వాత వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తీసేయాల్సి ఉంది. అమెరికాలో పూర్తిగా తీసేశారు. మన దేశంలో ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. ఉత్తరా దిలో కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువగా.. దక్షిణాదిలో ఎక్కువగా రేటు వసూలు చేస్తున్నారు. అసలు దక్షిణాదిలో ఈ ఫీజును పూర్తిగా తీసేయాలి..’’అని సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఆంగ్ల సినిమాలకు వీపీఎఫ్ వసూలు చేయని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏమాత్రం పట్టించుకోవడం లేదు..: థియేటర్లలో వాణిజ్య ప్రకటనల నిడివిని 8 నిమిషాలకి తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిల్మ్ చాంబర్ నుంచి పంపిన 2 సినిమా ట్రైలర్లను తప్పకుండా ప్రదర్శించా లని చెప్పినా సర్వీసు ప్రొవైడర్లు వేయడం లేదన్నారు. మార్కెట్‌లో 90% క్యూబ్, యూఎఫ్‌వోల వాటా ఉందని, మిగతా 10% పీఎక్స్‌డీ, రాక్స్, అల్ట్రా, ప్రొవిజ్ వంటి సంస్థల చేతిలో ఉందని తెలి పారు. రేట్లు తగ్గించడం సహా పలు అంశాలపై చర్చలు కొనసా గుతున్నాయని.. చర్చలు ఫలిస్తే సినిమాల ప్రదర్శన యథావిధి గా ఉంటుందని చెప్పారు.
చిన్న సినిమాలకూ మరింత ప్రయోజనం ఉండేలా చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ భాషా సినిమా ప్రదర్శనలను శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నామని.. హిందీ, ఇంగ్లిష్ సినిమాల వాళ్లతోనూ మాట్లా డుతున్నామన్నారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ íకిరణ్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ ముత్యాల రాందాస్, డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ తరఫున మురళీమోహన్, నిర్మాతలు సి.కల్యాణ్, సునీల్ నారంగ్ పాల్గొన్నారు.