భాగ్యనగరం అనగానే కులీ కుతుబ్‌షా 1591లో నిర్మించిన పట్టణం... అని చరిత్ర చెబుతుంది. మరి అంతకు పూర్వం సంగతేంటి? చరిత్ర పుటలు తిరగేస్తే 1518లో కుతుబ్‌షాహీ పాలన ఆరంభం కాకముందు ఢిల్లీ సుల్తానులు, అంతకు పూర్వం కాకతీయులు, వారికంటే ముందు చాళుక్యుల పాలన.. ఇలా కనిపిస్తాయి. కాకతీయుల కాలం కంటే పూర్వమే గోల్కొండ పట్టణం ఉండేదన్న సంగతిని చరిత్ర చెబుతుంది, కానీ ఎక్కడా ఆధారాలు కనిపించవు. దాదాపు మూడు వేల ఏళ్ల క్రితమే ఈ నగర ప్రాంతంలో మానవ సంచారం ఉందనడానికి ఇప్పుడు ఆధారాలు లభించాయి. రాతి యుగానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఆధారాలు వెలుగు చూడటం సహజమే. కానీ హైదరాబాద్ మహానగరంలో వాటి జాడలు దొరకడం అరుదు. నగరం మధ్య గుండా సాగుతున్న మూసీ నదిలో మూడు వేల ఏళ్ల క్రితం కొత్తరాతి యుగం జాడలు, దాని ఒడ్డున దాదాపు 1,500 ఏళ్ల క్రితం విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధ ఉద్దేశిక స్తూపాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ చరిత్ర కొత్త పుటను పరిచయం చేస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
–సాక్షి, హైదరాబాద్
బౌద్ధానికి తెలంగాణ నేలతో ఉన్న అనుబంధం అసాధారణం. బుద్ధుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆయన బతికున్న కాలంలోనే ప్రచారం మొదలైంది తెలంగాణ నుంచే అన్న విషయం ఇప్పుడిప్పుడే ఆధార సహితంగా రూఢీ అవుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బౌద్ధ ఉద్దేశిక స్తూపాలెన్నో విస్తరించి ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రాచుర్యం కల్పించకపోవటంతో మరుగున పడిపోయాయి. ఇప్పుడు బుద్ధవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో కొత్త అన్వేషణ సాగుతుండటం కొంతలో కొంత శుభపరిణామం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అన్వేషణలోనే హైదరాబాద్ చరిత్రలో పురాతన కోణం వెలుగుచూడటం విశేషం. ఆ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎం.ఎ.శ్రీనివాసన్, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్ మూసీ తీరంలో రెండు రోజుల క్రితం జరిపిన అన్వేషణలో ఆధారాలు వెలుగు చూశాయి. దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న కొసగుండ్ల నరసింహస్వామి దేవాలయంలో బౌద్ధం జాడలున్నాయన్న సంగతిని దాదాపు 4 దశాబ్దాల క్రితమే పురావస్తుశాఖ అధికారి పరబ్రహ్మచారి గుర్తించారు.
ఇక్కడ దాదాపు ఐదో శతాబ్దం నాటి శాసనాన్ని ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత అన్వేషణ ముందుకు సాగలేదు. తాజాగా బుద్ధవనం తరఫున ఈ ఇద్దరు ఆ దేవాలయం గుట్టపై అన్వేషించే క్రమంలో ఆసక్తికర విషయాలు గుర్తించారు. పెద్దగుండుపై విష్ణుకుండిల కాలానికి చెందిన గోవిందరాజ వర్మ ఏర్పాటు చేసిన శాసనాన్ని గుర్తించారు. ఇదే ప్రాంతంలో రెండు బౌద్ధ ఉద్దేశిక స్తూపాలను గుర్తించారు. సాధారణంగా బౌద్ధ స్తూపాల్లో బుద్ధుడి ధాతువు ఉంటుంది. కానీ ఉద్దేశిక స్తూపాలను నాటి ముఖ్యమైన బౌద్ధ సన్యాసుల స్మారకంగా నిర్మిస్తారు. ఇక్కడ తదనంతర కాలంలో ఏర్పాటు చేసిన ఓ శివలింగంతో కూడిన రాయి దిగువన ఉద్దేశిక స్తూపం ఉన్నట్టు గుర్తించారు. గుట్టకు ఆనుకుని వెనక వైపు ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో భూమిలో కూరుకుపోయి ఉన్న మరో ఉద్దేశిక స్తూపాన్ని గుర్తించారు. చెట్ల పొదలు, కొంత మట్టిని పక్కకు జరపగా వృత్తాకారంలో ఉన్న ఈ స్తూపం కనిపించింది. దాని చుట్టూ మట్టిని తొలగిస్తే ఆ స్తూపం పూర్తి ఆకృతి వెలుగు చూస్తుంది. నగరం నడిబొడ్డున బౌద్ధానికి చెందిన ఉద్దేశిక స్తూపం వెలుగుచూడటం ఇదే తొలిసారి.
మూసీ మధ్యలో కొత్తరాతియుగం చిత్రాలు...
చైతన్యపురికి సమీపంలోనే ఉన్న మూసీ నది మధ్యలో ఉన్న ఓ భారీ బండరాయి మూడు వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగం మానవ సంచారానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ బండరాయిపై నాటి మానవులు గీసిన ఎరుపు వర్ణం చిత్రం కనిపించింది. దాదాపు మూడు అడుగుల పొడవుతో ఉన్న ఈ చిత్రంలో పశువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. రాతియుగంలో మానవులు సమూహంగా ఉంటూ ఆవాసయోగ్యంగా చేసుకున్న ప్రాంతాల్లో ఇలా చిత్రాలు గీయటం సహజం. నగరంలో కూడా ఇలా ఆవాసాలు ఎన్నో ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. పట్టణీకరణ క్రమంలో చాలా గుట్టలను క్వారీలతో మాయం చేయటంతో ఈ ఆధారాలు నాశనమయ్యాయి. గండిపేట సమీపంలోని కోకాపేటలో ఓ గుట్టపై ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలున్నాయి.
ఆ గుట్టలన్నీ క్వారీల పేరుతో కనుమరుగు కాగా, స్థానికుల చొరవతో ఈ చిత్రాలున్న ఒక్క గుండును మాత్రం వదిలేశారు. అది తప్ప రాక్ పెయింటింగ్స్ నగరంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మూసీ మధ్యలో పెద్ద గుండుపై కనిపించటం ఆసక్తిరేపుతోంది. ఆ చుట్టుపక్కన ఉన్న రాళ్లను జల్లెడ పడితే మరిన్ని చిత్రాలు కనిపించే అవకాశం ఉందని శ్రీనివాసన్ అంటున్నారు. ప్రత్యేక పద్ధతిలో ఆ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపించేలా చేయాల్సి ఉంది. నాటి మానవులు ఆయుధాలను నూరుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రూవ్స్ కూడా బండలపై ఉన్నాయి.
వెలికితీసి పరిరక్షించాలని మంత్రికి వినతి
ఇప్పుడు గుర్తించిన ఉద్దేశిక స్తూపాలను వెంటనే వెలికి తీసి పరిరక్షించాలంటూ బుద్ధవనం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండురోజుల క్రితం గుర్తించిన ఆధారాల వివరాలను హెరిటేజ్ తెలంగాణ విభాగం అధికారులకు, మంత్రి శ్రీనివాసగౌడ్‌కు అందజేశారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి స్తూపాలను పూర్తిగా వెలికి తీయాలని కోరారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు వెలుగు చూస్తాయని శ్రీనివాసన్ అంటున్నారు. ఇది హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన విషయం అయినందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment