మంత్రిగారూ.. మాకో పదవి ఇవ్వరూ!
తాండూరు: టీఆర్‌ఎస్‌లో నామినేటెడ్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవలే తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి మంత్రి పదవి చేపట్టడంతో ఆయా పదవులను ఆశిస్తున్న నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రికి సన్నిహితంగా ఉండే నాయకులతోపాటు సీనియర్లు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ఏ నామినేటెడ్ పదవి దక్కాలన్నా మంత్రి కటాక్షం తప్పనిసరి కావడంతో నామినేటెడ్ రాజకీయమంతా ఆయన చుట్టే తిరుగుతోంది. తాండూరుతోపాటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మహేందర్‌రెడ్డి సన్నిహిత వర్గాల ద్వారా పైరవీలు చేస్తున్నారు.
దీంతో తాండూరులోని పార్టీ సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తంరావుకు రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం తాండూరు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఐనెల్లి మాధవరెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డి,యాలాల మండలం నాయకుడు సురేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్‌లు పోటీ పడుతున్నారు. ఈ నలుగురికీ మహేందర్‌రెడ్డి సన్నిహితులుగా పేరుంది.
వీరిలో మంత్రి ఎవరి వైపు మొగ్గుచూపుతారో అంతుచిక్కడం లేదు. బషీరాబాద్ మండలానికి చెందిన వారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. యాలాల పీఏసీఎస్ డెరైక్టర్ శెట్టి అమితానంద్‌కు కూడా జిల్లాస్థాయిలో పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక శ్రీభావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ పదవికి కూదెళ్ళి భద్రన్న, తంబాకు చంద్రశేఖర్ రేసులో ఉన్నారు. శ్రీకాళికాదేవి, పోట్లీ మహారాజ్, శ్రీ స్టేషన్ హనుమాన్ దేవాలయాల చైర్మన్ల పదవుల కోసం పలువురు పోటీ పడుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అగ్గనూర్ జగదీశ్వర్, కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆర్ బస్వరాజ్ తదితర సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారని సమాచారం.
మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఓటమి చెందిన విజయాదేవికీ మంచి పదవి ఇవ్వాలని మంత్రి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులతోపాటు మహేందర్‌రెడ్డి హామీతో ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల నాయకులూ పదవులు ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. ఆయా పదవులను ఆశిస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వొద్దని కూడా మరికొందరు పావులు కదుపుతున్నారు. పదవుల పంపకాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి కటాక్షం ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే.