మెదక్, న్యూస్‌లైన్: నామినేటెడ్ పోస్టులను టీఆర్‌ఎస్ దృష్టిపెట్టింది. రాజకీయ పరమైన ఉపాధి కల్పించే ఉద్దేశంతో పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల కోసం నియోజకవర్గంలోని నాయకుల మధ్య పోటీ పెరుగుతోంది. దేవాదాయ శాఖలోని ధర్మకర్తల పాలకమండలి, మార్కెట్ కమిటీ పాలక వర్గం, చెరకు అభివృద్ధి మండలి పోస్టుల కోసం టీఆర్‌ఎస్ నాయకులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమించిన నామినేటెడ్ పోస్టులను, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రద్దు చేస్తారనే చర్చ జరుగుతోంది.
జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 20 దేవాలయాలు గుర్తింపు పొందాయి. 6 ‘ఏ’ ఆలయాలుగా ఏడుపాయల(పాపన్నపేట) వీరభద్రస్వామి (బొంతపల్లి), లక్ష్మినర్సింహస్వామి (నాచారం), సంగమేశ్వరస్వామి (ఝరాసంఘం), 6 ‘బి’ ఆలయాలుగా వెంకటేశ్వరస్వామి (సిద్దిపేట), కోటిలింగేశ్వరస్వామి (సిద్దిపేట), సంతోషిమాత ఆలయం(సిద్దిపేట), శరభేశ్వర స్వామి(సిద్దిపేట), మల్లికార్జున స్వామి (దుబ్బాక), కొండపోచమ్మ ఆలయం (జగదేవ్‌పూర్), మహంకాళి ఆలయం (రామాయంపేట), భ్రమరాంబికా మల్లికార్జున స్వామి (బీరంగూడ), 6సీ ఆలయాలుగా గణేష్ ఆలయం (రుద్రారం), లక్ష్మినర్సింహస్వామి (సికింద్లాపూర్), రాచన్నస్వామి (జహీరాబాద్), రాచన్నస్వామి (బడంపేట), శివాలయం(సంగారెడ్డి), శివాలయం(కంది), ఆంజనేయస్వామి ఆలయం(చాకరిమెట్ల), వెంకటేశ్వరస్వామి ఆలయ(చల్మెడ) పాలక మండళ్లను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం అన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులే చైర్మన్లు, డెరైక్టర్లుగా కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా ఇందులో జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటు కాలేదు. మిగతా 15మార్కెట్ కమిటీలకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పాలక మండళ్లు కొనసాగుతున్నారు. చెరకు అభివృద్ధి మండలి విషయానికి వస్తే జిల్లాలో మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ స్థానాల్లో సీడీసీలు ఉన్నాయి. కాగా జహీరాబాద్ సీడీసీ పాలక మండలి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అయితే సీడీసీ పాలకమండలి పదవీకాలం మూడేళ్లు, దేవాదాయశాఖ, మార్కెట్ కమిటీల పాలక మండలిల పదవీకాలం రెండేళ్ల పరిమితి ఉంది. అయితే వీటిలో కొన్ని పాలక మండళ్లు ఏడాదిక్రితం, మరికొన్ని ఆరు నెలల క్రితం ఏర్పడ్డాయి.
కాని ఈ మండళ్లను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో జూన్ 2న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో పాత పాలక వర్గాలను రద్దు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేబోతుందన్న ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఏడుపాయల దేవస్థానం పాలకవర్గ చైర్మన్, ధర్మకర్తల మండలి పదవుల కోసం పాపన్నపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ మండల శాఖ కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన త్యార్ల రమేష్, మాజీ మండల టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు కిష్టాగౌడ్, ఏడుపాయల చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలక మండలిని రెండేళ్ల కోసం నియమించినందున మధ్యలో రద్దుచేస్తే కోర్టుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ ఆర్డినెన్స్ ద్వారా పాలక మండలిని రద్దు చేస్తారన్న ధీమాను టీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో దేవాదాయ శాఖలో సుమారు 20 క్షేత్రాలకు పాలక మండళ్లు ఉన్నాయి. అన్ని చోట్ల కాంగ్రెస్‌వారే అధికారంలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 18 మార్కెట్ కమిటీలు ఉండగా జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు ఏర్పాటు కాలేదు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు వాటిపై కన్నేశారు. ఈమేరకు అధికారం పొందడానికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మెదక్ మార్కెట్ కమిటీ కోసం టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కిష్టాగౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ సీడీసీ పాలక మండలిపై కూడా టీఆర్‌ఎస్ నాయకులు ఓ కన్నేసి ఉంచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
నామినేటెడ్ పోస్టులపై టీఆర్‌ఎస్ నేతల దృష్టి
Published Sat, May 24 2014 11:49 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement